- కేసీఆర్ ఓ తుగ్లక్.. కేటీఆర్ పెద్ద తుగ్లక్
- వీ6 బిజినెస్ సొల్యూషన్స్ బెంగళూరు సంస్థ
- నెట్ లో సెర్చ్ చేస్తే అన్ని విషయాలు తెలుస్తయ్
- సోషల్ మీడియాలో కేటీఆర్ టీంది అసత్య ప్రచారం
- ఎఫ్టీఎల్, బఫర్ జోన్ రూల్స్ పాటించే 2006లో ఫాంహౌస్ కట్టినం
- ప్రజా సమస్యలపై వీ6, వెలుగు ముందుంటుంది
- వీ6, వెలుగుపై కక్షతోనే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తుండ్రు
- ఎన్నికల వేళ బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఈడీ రెయిడ్స్ చేయించాయి
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. వాళ్ల పార్టీ అధికారంలో ఉన్పుడు వీ6, వెలుగును బ్యాన్ చేసిందని, ఇప్పుడు వీ6 బిజెనెస్ సొల్యూషన్స్ తనదేనంటూ బద్నాం చేస్తున్నారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. కేసీఆర్ ఓ తుగ్లక్ అని, రాత్రి పూట నిర్ణయాలు తీసుకొని తెల్లారేసరికి అమలు చేసేవారని చెప్పారు. తప్పుడు ఆరోపణలు చేయడంలో కేటీఆర్ పెద్ద తుగ్లక్ అని అన్నారు. కేటీఆర్ చెప్తున్నట్టు వీ6 బిజినెస్ సొల్యూషన్స్ సంస్థకు కర్ణాటక వాల్మీకి స్కాంలో భాగం ఉందని, ఆ సంస్థకు 4.5 కోట్లు బదిలీ అయ్యారని కేటీఆర్ ఆరోపిస్తున్నారని అన్నారు. నెట్ లోకి వెళ్లి చెక్ చేస్తే నిజానిజాలు బయటపడుతాయని చెప్పారు. ఆ సంస్థకు బెంగళూరులోని హంపీనగర్ లో ఆ సంస్థకు ఆఫీసు ఉందని చెప్పారు. వీ6 బిజినెస్ సొల్యూషన్స్ తో వీ6, వెలుగు మీడియాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. కేటీఆర్ ఆరోపణలు చేసేముందు ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోవాలని సూచించారు. వాళ్ల టీం సోషల్ మీడియా వేదికగా అసత్యాలను ప్రచారం చేస్తోందని ఆరోపించారు.
అసత్యాల ‘నమస్తే’
ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఫాంహౌస్ కట్టినట్టు వాళ్ల పత్రిక నమస్తే తెలంగాణ అసత్యాలను రాసిందని, ఆ స్థలాన్ని తాను 2006లో కొనుగోలు చేసి ఫాంహౌస్ నిర్మించినట్టు చెప్పారు. వాస్తవానికి ఏ చెరువుకైనా 30 మీటర్ల ఎఫ్టీఎల్ ఉంటుందని, ఆ తర్వాత బఫర్ జోన్ ఉంటుందని అన్నారు. అవన్నీ దాటిన తర్వాతే నిర్మాణం ఉందని తెలిపారు. నమస్తే తెలంగాణలో చూపించిన ఫాంహౌస్ తనది కాదని అన్నారు. తనపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను ఖండిస్తున్నట్టు వివేక్ వెంకటస్వామి చెప్పారు.
ప్రజల కోసమే వీ6
వీ6, వెలుగు ఎప్పుడూ ప్రజల పక్షమేనని, తెలంగాణ ఉద్యమ సమయంలోనే వీ6 చానల్ ప్రారంభమైందని వివేక్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో వెలుగు దినపత్రికకు ప్రకటనలు ఇవ్వలేదని, పొరుగు రాష్ట్రాల పేపర్లకు కూడా ప్రకటనలు ఇచ్చారని చెప్పారు. దాదాపు 150 కోట్ల నష్టం జరిగిందని అన్నారు. అయినా తెలంగాణ ప్రజల గొంతుకగా నిలిచిందని, బీఆర్ఎస్ ను గద్దె దించడంలో కీలక భూమిక పోషించిందని అన్నారు. ఇదే క్రమంలో వీ6, వెలుగును బ్యాన్ చేస్తున్నట్టు కేటీఆర్ చెప్పారని గుర్తు చేశారు. ఆ తర్వాత చానల్ కు, పత్రికకు మరింత ఆదరణ పెరిగిందని చెప్పారు. అధికారంలో ఉన్నపుడు బ్యాన్ చేసిన కేటీఆర్.. ఇప్పుడు బద్నాం చేసే కార్యక్రమం ముందు పెట్టుకున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై తనపై ఈడీ రెయిడ్స్ చేయించాయని అన్నారు. విజయన్ సెక్యూరిటీ సర్వీసెస్ ద్వారా 8 కోట్ల రూపాయలు పట్టుకున్నారని, నిజాలు నిగ్గు తేలడంతో ఈడీ ఆఫీసర్లు తమ డబ్బులను తిరిగి ఇచ్చేశారని చెప్పారు. అవకాశం దొరికినప్పుడల్లా కేటీఆర్ తమపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వారం రో జులుగా తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, అందుకే నిజానిజాలను ప్రజలకు విడమర్చి చెబుతున్నట్టు తెలిపారు.
అవినీతిని బయటపెట్టామనే కక్ష
కేసీఆర్ ఫ్యామిలీ అవినీతిని వీ6, వెలుగు బయటపెట్టిందనే కక్షతోనే కేటీఆర్ అర్థంలేని ఆరోపణలకు దిగుతారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును 33 వేల కోట్లకు డిజైన్ చేసి లక్షా 25 వేల కోట్లకు పెంచి అందినంత దోచుకున్నారని వివేక్ ఆరోపించారు. మిషన్ భగీరథలోనూ భారీ అవినీతి జరిగిందని అన్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో సారు, కారు 16 అని ప్రచారం చేసుకొని ఎన్నికలకు వెళ్లి కేవలం 9 సీట్లే గెలుచుకున్నారని గుర్తు చేశారు. సాక్షాత్తూ కేటీఆర్ చెల్లెలు కవిత ఓడిపోయారని అన్నారు. కేటీఆర్.. సొంత చెల్లెలును గెలిపించుకోలేక పోయారని విమర్శించారు.
నిజాలు తెలుసుకొని మాట్లాడండి
నిజాలు తెలుసుకొని విమర్శలు చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ కు వివేక్ హితవు పలికారు. అడ్డగోలుగా విమర్శలు చేయొద్దని సూచించారు. తనపై చేసిన ఆరోపనలు కేటీఆర్ నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమేనని వివేక్ అన్నారు. తన సంస్థలన్నీ చట్టబద్ధంగానే నడుస్తున్నాయని చెప్పారు. పదేండ్లు మంత్రిగా ఉన్న కేటీఆర్ సినిమా తారలతో కుమ్మక్కై ఎఫ్టీఎల్ లో ఉన్న భవనాలను కూల్చలేదని, ప్రస్తుతం తమ ప్రభుత్వం ఆ పని ప్రారంభించిందని చెప్పారు. తనను విమర్శించే ముందు ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోవాలని సూచించారు.