కాళేశ్వరం ప్రాజెక్టుతో రూ.వేల కోట్ల ప్రజాధనం వృధా అయ్యిందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఆంధ్ర కాంట్రక్టర్లే బాగుపడ్డారని చెప్పారు. ఫిబ్రవరి 17వ తేదీ శనివారం అసెంబ్లీలో ఇరిగేషన్ పై ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ.. ప్రాణహిత ప్రాజెక్టు కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో వెంకటస్వామి మాట్లాడారని... ఆయనను ఒప్పించి ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేశారని తెలిపారు.
ఈ ప్రాజెక్టు కోసం రూ.11 వేల కోట్లు కూడా ఖర్చు చేయడం జరిగిందని.. ఇంకో రూ.26 కోట్లు ఖర్చు చేస్తే పూర్తి అయ్యేదని.. కానీ, కేసీఆర్.. రీడిజైన్ పేరుతో నిపుల కమిటీ వద్దని చెప్పినా వినకుండా.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని విమర్శించారు. ఈ ఐదేళ్లలో కాళేశ్వరం ద్వారా 940 టీఎంసీల నీళ్లను పంపింగ్ చేయాల్సి ఉండగా.. కేవలం 18శాతం మాత్రమే పంపింగ్ చేశారని అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల చెన్నూరు, మంచిర్యాల, మంథని నియోజకవర్గాల్లో సుమారు లక్ష ఎకరాలు ముంపుకు గురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని.. ముంపు రైతులను ఆదుకోవాలని ఇరిగేషన్ మంత్రిని కోరినట్లు చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులు నష్ట పోయారని...కాళేశ్వరం ప్రాజెక్టు, కృష్ణా జలాలపై కథనాలు వేసినందుకు వీ6, వెలుగును గత ప్రభుత్వం బ్యాన్ చేసిందని గుర్తు చేశారు. కృష్ణా జలాలపై కేసీఆర్, జగన్ ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు. కృష్ణా నదిపై పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకుండానే నిర్మిస్తుంటే.. అధికారంలో ఉన్న కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అపెక్స్ కౌన్సిలింగ్ మీటింగ్ కు కేసీఆర్ పోకుండా.. ఆ కాంట్రాక్టును మేగా కంపెనీకి ఇచ్చేలా కేసీఆర్ ప్లాన్ చేశారని అన్నారు. కృష్ణా నదిపై ప్రాజెక్టుల్లో డబ్బులు దుర్వినియోగం జరిగితే ఎందుకు విచారణ జరగేదని ప్రశ్నించారు. కేసీఆర్ ఎమ్మెల్యే వివేక్ ప్రశ్నించారు.