కరీంనగర్: మాలలు ఐక్యంగా ఉండి పోరాటానికి సిద్ధంగా ఉండాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎస్సీల ఐక్యత కోసం మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ చేపట్టిన పాదయాత్ర ఇవాల్టికి కరీంనగర్ జిల్లా మానకొండూరుకు చేరింది. పాదయాత్రలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొందరు నాయకులు రాష్ట్రంలో మాలలు తక్కువగా ఉన్నారని మాట్లాడటం సరికాదన్నారు. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా మాలలు ఉన్నారని ఆయన తెలిపారు.
'మాలల ఐక్యత చాటేందుకు ఇప్పటి వరకు నిర్వహించిన సభలన్నీ విజయవంతమయ్యా యి. ఇవాళ నిజామాబాద్ లో కూడా మాలల ఐక్యత సభ పెద్ద ఎత్తున జరగబోతోంది. మాల కులస్తుల సమస్యల కోసం ఎక్కడ సభ జరిగినా పెద్ద ఎత్తున హాజరుకావాలి. మాలలపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టేందుకు పిల్లి సుధాకర్ చేపట్టిన యాత్ర సక్సెస్ కావాలని కో రుకుంటున్న. దళితుల్లో ఉపకులాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు వారందరికీ న్యాయం చేయాలి. ప్రైవేటు జాబ్ల్లో రిజర్వేషన్లు కల్పించాలి. మాలలు జాతి కోసం, హక్కుల సాధనకు డా. బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితో అందరూ కలిసి ఉద్యమించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుంది' అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు.