ధర్మారం, వెలుగు: మతిస్థిమితం లేక తప్పిపోయిన తప్పిపోయిన యువకుడిని రాజస్థాన్ నుంచి తీసుకొచ్చేందుకు విశాక ట్రస్ట్ చైర్మన్, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. వివరాలిలా ఉన్నాయి.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం గోపాల్‌రావుపేట గ్రామానికి చెందిన రెండ్ల రాజశేఖర్ (28) మతిస్థిమితం సరిగా లేకపోవడంతో తల్లిదండ్రులతో కలిసి ఇంటి వద్దే ఉండేవాడు.
14 నెలల కింద రాజశేఖర్ ఇంటి నుంచి మంచిర్యాల వెళ్లి గుర్తుతెలియని ట్రైన్ ఎక్కి రాజస్థాన్ చేరుకున్నాడు. అక్కడి అప్నాఘర్‌లో ఆశ్రమ నిర్వాహకులు చేరదీశారు. కుటుంబసభ్యులు రాజశేఖర్ ఆచూకీ కోసం వెతకగా 10 రోజుల కింద ఆశ్రమ నిర్వాహకులు గ్రామ మాజీ సర్పంచ్ అంజయ్యకు సమాచారమివ్వగా ఆయన కుటుంబసభ్యులకు విషయం చెప్పాడు.
తాము నిరుపేద కుటుంబానికి చెందినవారిమని అక్కడి వెళ్లేందుకు స్థోమత లేదని చెప్పడంతో అంజయ్య, గ్రామస్తులు రెండు రోజుల కింద విశాక ట్రస్ట్ చైర్మన్ వివేక్ వెంకటస్వామికి విషయం చెప్పారు. ఆయన స్పందింది ట్రస్ట్ కో ఆర్డినేటర్ కాడే సూర్యనారాయణ ద్వారా శనివారం రాజశేఖర్ కుటుంబ సభ్యులకు రూ.10వేలు అందజేశారు.