దళితుల కష్టాలు అమిత్​షాకు తెల్వయ్ : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

దళితుల కష్టాలు అమిత్​షాకు తెల్వయ్ : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
  • వాళ్లను కలిసి ఉంటే అంబేద్కర్ గొప్పతనం తెలిసేది: 
  • ఎస్సీ వాడల్లో తిరిగితే దళితుల బాధలు అర్థమైతయ్
  • అంబేద్కర్​ను అవమానించడాన్ని ఖండిస్తున్నం
  • మంచిర్యాల జిల్లాలో అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే విగ్రహావిష్కరణ

కోల్​బెల్ట్​/చెన్నూరు/జైపూర్, వెలుగు: దళితుల కష్టాలు కేంద్ర మంత్రి అమిత్ షాకు తెలియవని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. దళితులను కలిసి ఉంటే.. అంబేద్కర్ గొప్పతనం ఏంటో తెలిసేదని, ఎస్సీ వాడల్లో తిరిగితే వాళ్ల బాధలు అర్థం అయ్యేవని తెలిపారు. నీళ్లు, వైద్యం, విద్య వంటి సౌలత్​లు లేక ఇప్పటికీ దళితులు ఊరు బయట దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారని అన్నారు. పార్లమెంట్ వేదికగా అంబేద్కర్​ను అమిత్ షా అవమానించారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అంబేద్కర్​ను కించపరిస్తే దళిత సమాజం ఊరుకోదని హెచ్చరించారు. 

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులవాడలో సోమవారం అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఆర్ అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే విగ్రహాలను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ‘‘పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్​లో అన్ని చోట్ల అంబేద్కర్ విగ్రహాలు పెట్టాలని మా తండ్రి, మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి అప్పట్లోనే పిలుపునిచ్చారు. మేము సొంతంగా ఇప్పటిదాకా 100 విగ్రహాలు ఇచ్చినం. 

ఇంకా ఎక్కడైనా అంబేద్కర్ విగ్రహాలు కావాలంటే నిధులు ఇస్తాం. గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం. ప్రతి ఒక్కరికి మెరుగైన విద్య అందించాలన్న అంబేద్కర్ ఆశయం మేరకు రాష్ట్ర సర్కార్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నది. చెన్నూరు మండలం సోమనపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులకు శంకుస్థాపన చేసినం’’అని వివేక్ తెలిపారు.

స్టూడెంట్లకు తాగునీరు అందిస్తం

ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి అన్ని పట్టణాలు, గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటున్నట్లు ఎమ్మెల్యే వివేక్ తెలిపారు. ‘‘ప్రయారిటీ ప్రకారం ఫండ్స్ కేటాయిస్తూ అభివృద్ధి పనులు చేపడ్తున్నం. ఐదేండ్లలో నియోజకవర్గంలోని అన్ని సమస్యలు పరిష్కరిస్త. మొదటి ఏడాదిలో తాగునీరు, సైడ్ డ్రెయిన్స్, సీసీ రోడ్లకు ప్రాధాన్యం ఇచ్చాం. ఇక నుంచి విద్యకు ప్రయారిటీ ఇస్తాం. స్టూడెంట్లకు తాగునీరు అందించేందుకు ఆర్వో ప్లాంట్లు, మెస్ ఏర్పాటు చేస్తాం. ఇందుకు సీఎస్సాఆర్ నిధులు కేటాయిస్తం’’అని వివేక్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వివేక్​ను ఘనంగా సన్మానించారు.

108 అంబులెన్స్​ను సద్వినియోగం చేసుకోవాలి

చెన్నూర్ నియోజకవర్గంలో రూ.100 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే వివేక్ తెలిపారు. భీమారం మండలం కేంద్రంలో కొత్తగా మంజూరైన 108 అంబులెన్స్ సర్వీస్​ను కలెక్టర్ కుమార్ దీపక్​తో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. ‘‘భీమారం మండల ప్రజలు 108 వెహికల్ కావాలని చాలా సార్లు కోరారు. నేషనల్ హైవే 63పై ఉన్న జోడువాగుల వద్ద రోడ్డు రిపేర్ పనులు పూర్తయ్యాయి. మిషన్ భగీరథ స్కీమ్ ద్వారా నీళ్లు రావడం లేదు. అమృత్ పథకం కింద నీళ్లు అందిస్తున్నం. 108 అంబులెన్స్ సేవలు సద్వినియోగిం చేసుకోవాలి. చెన్నూరులో 100 పడకల హాస్పిటల్ అవసరం. దీని కోసం ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడిన’’అని వివేక్ తెలిపారు. 

గత ప్రభుత్వ హామీలపై కేటీఆర్​ను అసెంబ్లీలో నిలదీసిన..

గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రైతు కూలీలకు రైతు బంధు ఇవ్వాలని కోరితే కేసీఆర్ ఒప్పుకోలేదని వివేక్ తెలిపారు. ‘‘రైతు కూలీల గురించి అసెంబ్లీలో కేటీఆర్​ను నిలదీసిన. దళితులకు ఇస్తానన్న మూడెకరాల భూమిపై ప్రశ్నించిన. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీ మేరకు రైతుబంధు ఇస్తది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఎవరికీ లాభం కలగలేదు. కేసీఆర్ మాత్రం.. కాంట్రాక్టర్​లకు మొత్తం డబ్బులు చెల్లించిండు. నేతకాని సంఘం భవనం కోసం 5 గుంటల భూమి కేటాయించినం. 

రూ.20 లక్షల నిధులతో భవనం నిర్మిస్తం. నేతకాని కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తా. 198‌‌‌‌‌‌‌‌0లో మా నాన్న లెదర్ పార్క్ ఏర్పాటు చేశారు. త్వరలోనే మందమర్రిలో లెదర్ పార్క్​ను పున:ప్రారంభిస్తం’’అని వివేక్ హామీ ఇచ్చారు. మందమర్రి మున్సిపాలిటీకి వచ్చే ఏడాదిలో ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు. 50శాతం ఎస్టీ రిజర్వేషన్ ఉండాలని, చైర్మన్ పదవి కూడా ఎస్టీకే ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసినట్లు తెలిపారు.