యాదాద్రి తరహాలో ధర్మపురిని అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

 యాదాద్రి తరహాలో ధర్మపురిని అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

ముక్కోటి ఏకాదశి సందర్భంగా ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. డిసెంబర్ 23వ తేదీ శనివారం తెల్లవారుజామునుంచే భక్తులు ఆలయానికి  చేరుకుని వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటున్నారు. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి చెన్నూర్ ఎమ్మేల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఉత్తర ద్వారం నుంచి స్వామివారిన దర్శించుకున్నారు. ఆయనతోపాటు ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు.

 అనంతరం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడుతూ.. "ధర్మపురి ప్రజలు మార్పు కోరుకొని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను గెలిపించినందుకు ధన్యవాదాలు. ధర్మపురిని యాదాద్రి తరహాలో టూరిస్ట్ సెంటర్ చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయత్వంలో ధర్మపురి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం.
రాష్ట్రంలో ఉన్న అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలని కోరాను. రాష్ట్రం మూడు లక్షల కోట్ల అప్పు చేసిందని అనుకున్నారు.. కానీ, 6 లక్షల 70 వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఇప్పటి వరకు 14 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది.ఇంత డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టారో తెలపాలి. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాలను అతి త్వరలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 10 సంవత్సరాలు సెక్రటేరియట్ పోవాలంటే ఇబ్బందులు ఉండే... కానీ ఇప్పుడు ఎవరైనా వెళ్లొచ్చు. ఇది ప్రజల ప్రభుత్వం.. ప్రజల కోసమే పనిచేస్తుంది" అని అన్నారు.