
మంచిర్యాల: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేలాల గట్టు మల్లన్నను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దర్శించుకున్నారు. శుక్రవారం జైపూర్ మండలం వేలాల గట్టు మల్లన్న ఆలయాన్ని ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా.. తన సతీమణి గడ్డం సరోజ, కుమారుడు, కాంగ్రెస్ యువ నాయకుడు గడ్డం వంశీకృష్ణతో సందర్శించారు. ఈ సందర్భంగా మల్లన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మల్లన్నకు నిలువెత్తు తులాభారం వేసి ఆయన మొక్కులు సమర్పించుకున్నారు. తర్వాత ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు సత్కరించారు.
దర్శనం అనంతరం ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ.. కోరిన కోరికలు తీర్చే దేవుడు గట్టు మల్లన్న... ఈ ప్రాంత ప్రజలు ఆరాధ్య దైవంగా కొలుస్తారని అన్నారు. ప్రతి సంవత్సరం ఈ జాతరకు మూడు నుంచి నాలుగు లక్షల మంది వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని ఆయన తెలిపారు. ఈ జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి విశాఖ ట్రస్ట్ సేవలు అందిస్తుందని.. ఇప్పటికే చాలా చోట్ల బోర్లు వేశామని చెప్పారాయన. ఇక్కడ ప్రాంత ప్రజలు ఆలయానికి రోడ్లు వెలయాలని అడుగుతున్నారు.. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి రోడ్లు వేసి, మంచి నీటి కోసం సకల సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కాలి నడకన నడుచుకుంటూ వచ్చామని.. అందరూ కార్లలో కాకుండా వీలైనంత వరకు కాలి నడకన వస్తే భక్తులకు ఇబ్బంది ఉండదని వివేక్ సూచించారు.
కాగా, మహాశివరాత్రి పురస్కరించుకుని గట్టు మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.