ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి లేఖ

ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి లేఖ
  • రాష్ట్ర బడ్జెట్​లోనూ 18 శాతం ఫండ్స్ కేటాయించాలి


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు కేటాయించేలా చూడాలని కాంగ్రెస్ హైకమాండ్​ను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోరారు. ‘‘రాష్ట్రంలో ఎస్సీల జనాభా 18 శాతానికి పెరిగినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేలో తేలింది. దానికి అనుగుణంగా ఎస్సీల రిజర్వేషన్లను 18 శాతానికి పెంచాలి” అని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు వివేక్ గురువారం లేఖ రాశారు. 

కాంగ్రెస్ ఎల్లప్పుడూ సామాజిక న్యాయం కోసం పాటుపడుతుందని, అందుకు చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషనే నిదర్శనమని అందులో పేర్కొన్నారు. ‘‘బడ్జెట్​లో ఎస్సీలకు 15 శాతం నిధులు కేటాయించాలని 2013లో ఆనాటి కాంగ్రెస్ సర్కార్ చట్టం చేసింది. ఆ నిధులను తప్పనిసరిగా ఖర్చు చేయాలని అందులో పేర్కొంది. 

అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఎస్సీల జనాభా 18 శాతానికి పెరిగినందున, వచ్చే బడ్జెట్​లో ఎస్సీలకు 18 శాతం నిధులు కేటాయించేలా చూడాలి” అని విజ్ఞప్తి చేశారు. ‘‘రాష్ట్రంలోని ఎస్సీల్లో మెజార్టీ ప్రజలకు భూమి లేదు. దీంతో వాళ్లకు రైతు రుణమాఫీ, రైతు భరోసా లాంటి పథకాలతో లబ్ధి జరగడం లేదు. ఈ నేపథ్యంలో నేను చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలి” అని కోరారు.