తెలంగాణ రాష్ట్ర సాధనలో మంద జగన్నాథం పాత్ర మరువలేనిది: ఎమ్మెల్యే వివేక్

హైదరాబాద్: అనారోగ్యంతో మృతి చెందిన నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం కుటుంబ సభ్యులను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పరామర్శించారు. 2025, జనవరి 13న హైదరాబాద్‎లోని మంద జగన్నాథం నివాసానికి వెళ్లిన వివేక్.. జగన్నాథం చిత్ర పటానికి నివాళులర్పించారు. అనంతరం జగన్నాథం కుమారుడు శ్రీనాథ్‎ను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ.. మంద జగన్నాథం మాకు అత్యంత సన్నిహితులని తెలిపారు. 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంపీగా మంద జగన్నాథం పాత్ర మరువలేనిదని కొనియాడారు. తెలంగాణ కోసం కొట్లాడిన సమయంలో ప్రతి చోట జగన్నాథం ముందుడే వారని గుర్తు చేశారు. తెలంగాణ వస్తే చాలు.. ఎంపీ సీటు ఎంత అని ప్రణబ్ ముఖర్జీకి అల్టిమేటం చేసిన వ్యక్తి జగన్నాధం అని తెలిపారు. మంద జగన్నాథం మరణం దళిత జాతికి, తెలంగాణ ప్రజలకు తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. 

ALSO READ | కేంద్రానికి థ్యాంక్స్: ప్రపంచ దేశాలకు తెలంగాణ పసుపు : కోదండరెడ్డి

మంద జగన్నాథం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని పేర్కొన్నారు. కాగా, అనారోగ్యం కారణంగా హైదరాబాద్ ‎లోని నిమ్స్ లో చికిత్స పొందుతూ.. ఆరోగ్యం విషమించడంతో 2025, జనవరి 12వ తేదీన జగన్నాథం కన్నుమూసిన విషయం తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ జగన్నాథం అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించి గౌరవించింది.