- స్వచ్ఛందంగా కూల్చివేసిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
కామారెడ్డి, వెలుగు: రోడ్డు విస్తరణ పనులకు అడ్డుగా ఉండడంతో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి స్వచ్ఛందంగా తన ఇంటిని కూల్చేశారు. మాస్టర్‌ప్లాన్‌లో కామారెడ్డి పాత బస్టాండ్ నుంచి అడ్లూర్వైపు 80 ఫీట్ల రోడ్డు వేయాలని పేర్కొన్నారు. కానీ చాలాచోట్ల రోడ్డు ఇరుగ్గా ఉంది. కొంత దూరం సింగిల్ రోడ్డు, మరికొంత దూరం డబుల్‌రోడ్డు ఉంది. కలెక్టరేట్‌తో పాటు పట్టణంలోని కాలనీలు, అనేక గ్రామాలకు ఈ రోడ్డు మీది నుంచే రాకపోకలు సాగుతుండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఇదివరకే రోడ్డు విస్తరణ పనులకు రూ.కోటి మంజూరయ్యాయి. అయితే కొన్ని ఇండ్లు అడ్డుగా ఉండడంతో పాటు వివిధ కారణాలతో పనులు మొదలు కాలేదు. ఈ మార్గంలోనే ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇల్లు కూడా ఉంది. దీంతో శనివారం ఆయన తన ఇంటిని జేసీబీలతో దగ్గరుండి కూల్చి వేయించారు. దాదాపు వెయ్యి గజాల స్థలం రోడ్డు కింద పోనుంది. అక్కడికి వచ్చిన మున్సిపల్, ఆర్అండ్బీ, ఎన్పీడీసీఎల్ఆఫీసర్లతో రోడ్డు వెడల్పు పనులపై ఎమ్మెల్యే చర్చించారు.
ప్రజలకు ఇబ్బందులు ఉండొద్దనే కూల్చేసిన: ఎమ్మెల్యే
ప్రజలకు ఇబ్బందులు ఉండొద్దనే తన ఇంటిని కూల్చేశానని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తెలిపారు. రోడ్డు విస్తరణ పనుల విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందవద్దన్నారు. ‘‘ఎవరి ఇండ్లను కూడా అధికారులు కూల్చరు. రోడ్డును అక్రమించి వేసుకున్న షెడ్లను, ఇండ్ల ముందు ఉన్న నీటి కుళాయి గుంతలను స్వచ్ఛందంగా తొలగించుకుంటే చాలు. జిల్లా కేంద్రం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆ మార్పును నా ఇంటి నుంచే షూరు చేశాను. ఇండ్లు, కమర్షియల్ బిల్డింగ్లు కట్టే వాళ్లు రూల్స్ప్రకారమే కట్టుకోవాలి” అని అన్నారు.