
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. గత ప్రభుత్వ వైఫల్యాలను కాంగ్రెస్ ఎత్తిచూపుతుండగా.. ఎన్నికల్లో కాంగ్రెస్ హమీ ఇచ్చి ఇప్పటివరకు అమలు చేయని హామీలను ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా హామీలు ఇచ్చింది.. ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయలేక డీలిమిటేషన్ అని కొత్తరాగం అందుకుందని విమర్శించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో చేరేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ పార్టీలే బీజేపీని వ్యతిరేకిస్తున్నాయన్నారు. కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వలేదంటూ అవాస్తవాలు మాట్లాడొద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని.. చేసిన అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన స్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు.
Also Read : నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం.. సిద్ధమా..?
తెలంగాణ అప్పుల్లో కూరుకుపోవడానికి ప్రధాన ముద్దాయి బీఆర్ఎస్.. రెండో ముద్దాయి కాంగ్రెస్ అని విమర్శించారు. తెలంగాణ రైజింగ్ అని ప్రభుత్వం అంటోంది.. కానీ అప్పులు తీసుకురావడంలో తెలంగాణ రైజింగ్ కనిపిస్తోందని సెటైర్ వేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి అప్పుల అప్పారావు.. రొటేషన్ చక్రవర్తి వలే ఉందని ఎద్దేశా చేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్ని అమలు కావడం లేదని.. ఆసరా పెన్షన్ల పెంపు ఏది..? మహిళలకు రూ.2500 ఏవి అని ప్రశ్నించారు.