
- మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా
నిర్మల్, వెలుగు: అభివృద్ధి పనులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తానని, నిర్మల్‌ను రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలో రూ.62.5 కోట్లతో నిర్మించనున్న అమృత్ 2 తాగునీటి పథకానికి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. అక్కడి క్యాంపు ఆఫీసులో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం దిలావర్పూర్, నర్సాపూర్ జి మండలాల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పటికే నిర్మల్ నియోజక అభివృద్ధి కోసం రూ.800 కోట్లు మంజూరు చేయించానన్నారు. గతంలో ప్రజాప్రతినిధులు ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తామని తప్పుడు హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. తాను ఎమ్మెల్యేగా గెలవగానే ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎస్టీపీ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.42 కోట్లు మంజూరు చేయించానన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. ఆడ పిల్లల పెండ్లికి తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైందిన ప్రశ్నించారు. మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు రాంనాథ్, సత్యనారాయణ గౌడ్, మార్కె ట్ కమిటీ మాజీ చైర్మన్ రమణారెడ్డి, ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
సారంగాపూర్, వెలుగు: మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మహేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. 107 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం మోడల్ హౌస్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో లక్ష్మీ కాంతారావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకట నర్సయ్య, నాయకులు రాంశంకర్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్, బీజేపీ మండల్ ప్రెసిడెంట్ కాల్వ నరేశ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు
పాల్గొన్నారు.