పాలమూరు, వెలుగు: రోడ్డు ప్రమాదాలు ఏ రూపంలో వస్తాయో తెలియదని, జాగ్రత్తలు పాటిస్తూ ప్రాణాలు కాపాడుకోవాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆల్మాస్ఫంక్షన్ హాల్లో రాష్ట్ర రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీస్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మన ప్రాణాలకు మనమే భద్రంగా కాపాడుకోవాలన్నారు. రోడ్డు నిబంధనలు పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా తీసుకోవాలని సూచించారు. శ్రామిక వర్గాలకు కూడా ‘మహబూబ్ నగర్ విద్యా నిధి’ మాదిరిగా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని యోచిస్తున్నట్లు చెప్పారు.
అనంతరం రోడ్డు భద్రతా మాసోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. అలాగే మెట్టుగడ్డలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీని ఆకస్మిక తనిఖీ చేశారు. కాలేజీలోఉన్న కోర్సుల వివరాలు, కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలపై ప్రిన్సిపాల్ శాంతయ్యను అడిగి తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్టీవో కిషన్, వాసుదేవ్, డీఎస్పీ సుదర్శన్, ట్రాఫిక్ సీఐ భగవంత్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ పాల్గొన్నారు.