మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : చివరి వ్యక్తి వరకు సంక్షేమ ఫలాలు అందిస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ రూరల్ మండలం పోతన్పల్లిలో ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామానికి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని ఆరోపించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. సన్నవడ్లకు బోనస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు.
భూమిలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. అంతకుముందు గ్రామంలో రూ.14 లక్షలతో నిర్మించే అంగన్వాడీ భవనానికి, 2 లక్షల రూపాయలతో నిర్మించే మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. 10 లక్షల రూపాయలతో నిర్మించే సీసీ రోడ్డు నిర్మాణపు పనులకు శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత మధుసూదన్ రెడ్డి, తహసీల్దార్సుందరరాజు, ఎంపీడీవో కరుణశ్రీ, పీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ , మాధవి రెడ్డి, మైబు, రవీందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, గోవింద్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, సుధాకర్ రెడ్డి, నాగరాజు, నర్సింహారెడ్డి, గోపాల్ పాల్గొన్నారు.