
పాలమూరు, వెలుగు: నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధంగా ఉండాలని ఉచిత కోచింగ్ ను సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి నిరుద్యోగ యువతకు సూచించారు. ఎమ్మెల్యే తన సొంత నిధులతో హైదరాబాద్ ఫ్యాకల్టీ తో స్థానిక అంబేద్కర్ కళాభవన్ లో నిరుద్యోగ యువతకు ఎస్సై , పోలీసు కానిస్టేబుల్, వీఆర్వో, వీఆర్ఏ, టెట్, డీఎస్సీ పోటీ పరీక్షల కోసం ఏర్పాటు చేశారు.
ఈ ఉచిత కోచింగ్ ను సెంటర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ హైదరాబాద్ లోని కోచింగ్ సెంటర్లకు దీటుగా, అనుభవజ్ఞులైన హైదరాబాద్ ఫ్యాకల్టీ తో ఉచిత కోచింగ్ ఇప్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. త్వరలో వేలాది ప్రభుత్వ ఉద్యోగాలు రాబోతున్నాయని వాటి కోసం ఇప్పటినుంచే నిరుద్యోగ యువత కోచింగ్ తీసుకొని సిద్దంగా ఉండాలని సూచించారు.
కోచింగ్ కు వచ్చే విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పిస్తామని , నిపుణులు తయారు చేసిన మంచి స్టడీ మెటీరియల్స్ ను ఉచితంగా అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ రియాజ్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎంతో శ్రమకోర్చి ఉచిత కోచింగ్ ను నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విద్యార్థుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, గుండా మనోహర్, శ్రీనివాస్ యాదవ్, అవేజ్, ఫయాజ్, మోయీజ్, ప్రవీణ్ కుమార్, చర్ల శ్రీనివాసులు, పోతన్ పల్లి మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు .