పాలమూరు రుణం తీర్చుకునేందుకే.. విద్యా నిధి తీసుకొచ్చా : యెన్నం శ్రీనివాస్​ రెడ్డి

  • ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి

పాలమూరు, వెలుగు: ‘పాలమూరు ప్రజలు నాకు రాజకీయ బిక్ష పెట్టారు. ఎమ్మెల్యేగా నన్ను గెలిపించుకున్నారు. వారికి రుణ పడి ఉన్నా. అందుకే పాలమూరులో విద్యాభివృద్ధి కోసం విద్యా నిధి కార్యక్రమాన్ని తీసుకొచ్చా. దీని ద్వారా పేద విద్యార్థులకు విద్యా దానం చేస్తా’ అని మహబూబ్​నగర్​ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి తెలిపారు. శనివారం రాత్రి కలెక్టర్​ క్యాంప్​ ఆఫీస్​లో కలెక్టర్​ విజయేందిర బోయిని కలిశారు. విద్యానిధికి వచ్చిన రూ.4,95,211 -చెక్కులను దాతలతో కలిసి కలెక్టర్​కు అందజేశారు. ఈ సందర్భంగా యెన్నం మాట్లాడుతూ మహబూబ్​నగర్​ను ఎడ్యుకేషనల్  హబ్​గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. 

ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ‘విద్యా నిధి’కి రిషి కాలేజీ​యాజమాన్యం రూ.2 లక్షలు, కౌన్సిలర్  చలువగాలి శ్రీనివాస్ రాజు రూ.50 వేలు, లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సుందరీకరణ కమిటీ అధ్యక్షుడు పోల శ్రీనివాస్  రూ.51 వేలు, ముడా చైర్మన్  లక్ష్మణ్ యాదవ్  రూ.5 వేలు, మార్కెట్  కమిటీ చైర్మన్  బెక్కెరి అనిత రూ.25 వేలు, తెలంగాణ ఉద్యమకారుడు దోమ పరమేశ్వర్  రూ.11,111, రంగినేని మన్మోహన్  రూ.2,100, చందులాల్  రూ.5 వేలు విరాళం అందించారు. వీరికి ఎమ్మెల్యే ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

క్రీడా స్ఫూర్తిని చాటాలి

ఆటల పోటీల్లో క్రీడా స్ఫూర్తిని చాటాలని మహబూబ్​నగర్​ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి పిలుపునిచ్చారు. పాలమూరు గ్రౌండ్​లో జరుగుతున్న 68వ ఎస్జీఎఫ్​ నేషనల్  హ్యాండ్ బాల్  చాంపియన్​షిప్​ రెండో రోజు పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకొని వారికి అందుతున్న సౌలతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్లాక్  టవర్  వద్ద నిర్వహించిన శ్రీరామ కల్యాణానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. వడ్డెర ఓబన్న 218 వ జయంతి సందర్భంగా  పద్మావతి కాలనీలోని గ్రీన్ బెల్ట్​లో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు.

మున్సిపాలిటీ పరిధిలోని దొడ్డలోనిపల్లిలో రూ.81.60 లక్షలతో, అప్పన్నపల్లిలో 1.91 కోట్లతో, ఏనుగొండలో 1.10  కోట్లతో సీసీ రోడ్లు, అండర్​ డ్రైనేజీ పనులకు, వేంకటేశ్వర కాలనీలో కమ్యూనిటీ హాల్, పాత పాలమూరులో మల్టీపర్పస్​ కమ్యూనిటీ హాల్​ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీలకు పాలమూరు వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు. ఓటమిని విజయానికి నాందిగా భావించాలని క్రీడాకారులకు సూచించారు. ముడా చైర్మన్  లక్ష్మణ్  యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, నాయకులు శామ్యూల్  దాసరి, ప్రవీణ్ కుమార్, హ్యాండ్ బాల్  అసోసియేషన్ అధ్యక్షుడు రజినీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.