పాలమూరు, వెలుగు: భారీ వర్షాల నేపథ్యంలో పట్టణంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కోరారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొత్త చెరువు అలుగు పారుతున్న విషయాన్ని తెలుసుకొని.. అధికారులతో కలిసి కొత్త చెరువును పరిశీలించారు.
చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. బ్రిడ్జిని ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం కొత్త చెరువుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కౌన్సిలర్ మోయిన్ అలీ, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, ఏఈ బస్వరాజు, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ ఉన్నారు.
సేవాభావంతో పని చేయాలి
మెడికోలు సేవాభావంతో పని చేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. మెడికల్ కాలేజీ వార్షికోత్సవానికి హాజరై మాట్లాడారు. ఎంతగానో కృషి చేస్తే వచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో విద్యను అభ్యసిస్తున్నారని, దానికి పరిపూర్ణమైన న్యాయం చేసేందుకు గ్రామీణ ప్రాంత ప్రజలకు నిస్వార్థంతో వైద్య సేవలు అందించాలన్నారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసి అభినందించారు.డాక్టర్లు రమాదేవి, కిరణ్మయి, సంపత్ కుమార్, రమేశ్ పాల్గొన్నారు.