ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి

ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి

పాలమూరు, వెలుగు: హాస్టళ్లు, గురుకులాల్లో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్​ ఫంక్షన్​హాల్​లో జరిగిన పిల్లలమర్రి బాలోత్సవం కార్యక్రమానికి చీఫ్​ గెస్ట్​గా హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన కల్చరల్​ ప్రోగ్రామ్స్​ను వీక్షించారు. అనంతరం గర్ల్స్​ ఎస్సీ హాస్టల్(బి), ఎస్సీ హాస్టల్(డి), ఆనంద నిలయం, ఎస్సీ హాస్టల్(ఏ)ను విజిట్​ చేశారు. హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ బాయ్స్​ హాస్టల్​లో స్టూడెంట్లతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏకాగ్రతతో చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు.

ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు ప్రిపేర్​ కావాలని, తాను అండగా ఉంటానని, కావాల్సిన మెటీరియల్  ఉచితంగా అందిస్తానని హామీ ఇచ్చారు. మహబూబ్​నగర్​ను ఎడ్యుకేషనల్  హబ్​గా అభివృద్ధి చేయాలనే  లక్ష్యంతో స్కూల్స్, హాస్టల్స్, గురుకులాల్లో అన్నిరకాల సౌలతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. పోటీ పరీక్షలకు తయారయ్యే వారి కోసం పుస్తకాలు, డిజిటల్  బోర్డు అందిస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు కాంగ్రెస్​ పార్టీ ఆఫీస్​లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్​ మృతికి సంతాపం తెలిపారు. ఆయన ఫొటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. మున్సిపల్​ చైర్మన్​ ఆనంద్​ గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్.వినోద్​ కుమార్​ పాల్గొన్నారు.