మహబూబ్ నగర్ రూరర్, వెలుగు : బేడ బుడగ జంగం వారి హక్కుల సాధనకు కృషి చేస్తానని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం మహబూబ్ నగర్ రూరర్ మండలంలోని దివిటిపల్లి గ్రామంలో బేడ బుడగ జంగం ఆధ్వర్యంలో నెలకొల్పిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చూస్తే ఒక చేతిలో పుస్తకం, మరోచేయి మన లక్ష్యాన్ని చూపిస్తుందని తెలిపారు.
చదువు ప్రాముఖ్యతను ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కనీసం డిగ్రీ వరకు చదివించేలా నిర్ణయం తీసుకోవాలన్నారు. ఉద్యోగం సాధించడమే ముఖ్యంకాదని.. నలుగురికి ఉపాధి కల్పించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, రాష్ట్ర బేడ బుడగ జంగం అధ్యక్షుడు కోడుకంటి నర్సింహులు, జిల్లా అధ్యక్షుడు సిరిగిరి శ్రీను, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, నాయకులు మురళి, ఆంజనేయులు, మన్నెం పాల్గొన్నారు.
దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకొందాం..
పాలమూరు, వెలుగు : రాజకీయాలకతీతంగా దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకొందామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆర్అండ్ బీ అతిథి గృహంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా జడ్పీ మైదానంలో దసరా ఉత్సవాలు నిర్వహించేవారమని, ఈసారి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఉత్సవ కమిటీ సభ్యులు, మున్సిపాలిటీ సిబ్బంది సమన్వయంతో ఘనంగా దసరా ఉత్సవాలు జరిగేందుకు ఏర్పాట్లు చేస్తారని తెలిపారు. అనంతరం దసరా ఉత్సవాల పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. అంతకుముందు ఎస్వీఎస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో వరల్డ్ ఆర్థరైటిస్ డే సందర్భంగా వాక్ తాన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై జెండా ఊపి ప్రారంభించారు.