![పండుగ సాయన్న ఆశయాలను కొనసాగిస్తాం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి](https://static.v6velugu.com/uploads/2025/02/mla-yennam-srinivas-reddy-unveils-pandaga-sayanna-statue_ZsPutnHhzJ.jpg)
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు వీరుడు పండుగ సాయన్న ఆశయాలను కొనసాగిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం రూరల్ మండలం ధర్మపూర్ గ్రామంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి పండుగ సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కోసం రాబిన్ హుడ్‌గా అవతారం ఎత్తి బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సేవచేశారని తెలిపారు. కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రాగానే అందేశ్రీ రచించిన తెలంగాణ రాష్ట్ర గీతంలో పండుగ సాయన్న వీర గాథను పొందుపరిచామని, ప్రతి రోజూ ప్రతి పాఠశాలలో ఆయనను స్మరించుకుంటున్నామని ఆయన అన్నారు.
రిజర్వేషన్లను కోర్టులు ఆమోదించాలంటే చట్టబద్ధత కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కులగణన చేపట్టినట్లు చెప్పారు. గతంలో సర్వేలో ఎవరైనా తమ వివరాలను ఇవ్వకపోయినా ఈసారి పాల్గొని సర్వేకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా బెక్కెం జనార్ధన్ రచించిన పండుగ సాయన్న పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ధర్మపూర్, రామచంద్రపురం, కోడూరు, కోటకద్ర గ్రామాల్లోని హైస్కూళ్లలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎమ్మెల్యే ఆత్మీయ కానుకగా తన సొంత నిధులతో డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్‌ను ఉచితంగా అందజేశారు.
దేశాభివృద్ధిలో విద్యాలయాల పాత్ర కీలకం
పాలమూరు, వెలుగు: దేశాభివృద్ధిలో విద్యాలయాల పాత్ర కీలకమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో రూ.69 లక్షలతో నిర్మించిన సీసీరోడ్డు, లైబ్రరీ భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. స్టూడెంట్స్బాగా చదివి ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలన్నారు.
భవిష్యత్‌లో స్కూల్అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం స్టూడెంట్స్చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. అంతకుముందు అంధుల ఆశ్రమ పాఠశాల లో చదివి వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడిన పలువురు పూర్వ విద్యార్థులను ఘనంగా సన్మానించారు.