మిషన్​భగీరథ నీళ్లను ప్రజలు తాగుతలేరు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డి

మిషన్​భగీరథ నీళ్లను ప్రజలు తాగుతలేరు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డి
  • గత ప్రభుత్వం కమీషన్ల కోసమే ఈ పథకాన్ని తీసుకొచ్చింది
  • మహబూబ్​నగర్​ఎమ్మెల్యే యెన్నం

మహబూబ్​నగర్​రూరల్, వెలుగు : మిషన్​భగీరథ నీటిని ప్రజలు ఎవరూ తాగడం లేదని, ఆ నీటిని బట్టలు ఉతకడానికి వినియోగిస్తున్నారని మహబూబ్​నగర్​ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డి ఫైర్​ఎద్దేవా చేశారు. కమీషన్లు దండుకోవడానికే గత బీఆర్ఎస్​ప్రభుత్వం ఈ స్కీమును తీసుకొచ్చిందని ఆరోపించారు. పాలమూరు నియోజకవర్గంలో గురువారం ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మహబూబ్​నగర్​రూరల్ మండలంలోని ధర్మాపూర్ లో రూ.8 లక్షల ఎస్డీఎఫ్ నిధుల ద్వారా నిర్మించనున్న లైబ్రరీ భవనానికి శంకుస్థాపన చేశారు. 

కేవీఆర్​ఫౌల్ట్రీస్ ధర్మాపూర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్​ను ప్రారంభించారు. హన్వాడ మండలం వేపురులో యాదవ సంఘం భవనానికి భూమి పూజ, కిష్టంపల్లి నుంచి జూలపల్లి వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన, ఇబ్రహీంబాద్​ఆదర్శ పాఠశాలలో పలు డెవలప్​మెంట్​ పనులు, ఇదే గ్రామంలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవం, వీటితోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 

ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా ధర్మాపూర్ గ్రామానికి రూ.40 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. గ్రామాలకు బీటీ రోడ్డుతో పాటు తండాలకు రోడ్డు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, లీడర్లు సుధాకర్ రెడ్డి, గోవింద్ యాదవ్, కౌకుంట్ల నర్సింహారెడ్డి  పాల్గొన్నారు.