చాంద్రాయణగుట్ట, వెలుగు: పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను స్పీడప్ చేయాలని యాకుత్ పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్ అధికారులను ఆదేశించారు. చాంద్రాయణగుట్ట నర్కిపూల్ బాగ్ లోని జోనల్ కమిషనర్ ఆఫీస్లో గురువారం పలు విభాగాల అధికారులతో ఆయన సమీక్ష చేపట్టారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. రెయిన్ బజార్, తలబ్ చంచలం, సంతోష్ నగర్, కుర్మగూడ డివిజన్లలో కొనసాగుతున్న రోడ్ల నిర్మాణం, విస్తరణ, పారిశుధ్యం, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీ తదితర పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు.
సమావేశంలో సంతోష్ నగర్, తలబ్ చంచలం, పత్తర్ ఘట్టి, రెయిన్ బజార్, మొఘల్ పురా డివిజన్ల కార్పొరేటర్లు ముజాఫర్ హుస్సేన్, డాక్టర్ సమీనా బేగం, సయ్యద్ సోహెల్ ఖాద్రీ, మహమ్మద్ వసియుద్దీన్, నస్రీన్ సుల్తానా, జోనల్ కమిషనర్ టి. వెంకన్న, జోనల్ ఎస్ఈ మహేశ్వర్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.