మహబూబ్‌నగర్, వెలుగు: ఎన్నికల ముంగిట మంత్రులు, ఎమ్మెల్యేలు పల్లెబాట పడుతున్నారు. ‘గుడ్‌మార్నింగ్’, ‘పల్లె నిద్ర’ అంటూ రకరాల పేర్లతో ప్రజల మధ్య తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఎక్కడికి వెళ్లినా అక్కడ కనీసం రెండు, మూడు పనులకు శిలాఫలకాలను ఆవిష్కరిస్తున్నారు. రెండు, మూడేండ్ల కింద స్టార్ట్ చేసిన పనులకే ఫండ్స్లేక ఆగిపోయి ఉంటే.. కొత్తగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం విస్తుగొలుపుతోంది. ఇదంతా వచ్చే ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునేందుకు చేస్తున్న జిమ్మిక్కులు మాత్రమేనని జనాల్లో చర్చ జరుగుతోంది.
సీఎం ఆదేశాలతో గ్రామ పర్యటనలు
కొద్ది రోజుల కింద ప్రగతి భవన్లో మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమైన సీఎం కేసీఆర్.. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో నియోజకవర్గాలకు మకాం మార్చాలని, ఎలక్షన్స్ ముగిసేదాకా ప్రజల మధ్యే ఉండాలని ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యేలు, మంత్రులు నియోజకవర్గాల బాట పట్టారు. ‘పల్లె నిద్ర’, ‘గుడ్ మార్నింగ్’ లాంటి పేర్లతో గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఇటీవలి వరకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్చెక్కులు పంపిణీ చేశారు. అవి కూడా అయిపోవడంతో ఇప్పుడు అభివృద్ధి పనులకు భూమి పూజ, శంకుస్థాపన అంటూ హడావిడి చేస్తున్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్లు, జీపీ బిల్డింగులు, చెక్‌డ్యామ్‌లు.. ఇలా లోకల్ లీడర్లు ఏది అడిగితే అది సాంక్షన్ చేస్తూ, శిలాఫలకాలు వేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల ఎమ్మెల్యేలు ఈ విషయంలో ముందున్నారు. నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి ‘గుడ్ మార్నింగ్’ పేరుతో ప్రతి రోజూ ఒక గ్రామంలో పర్యటిస్తూ పంచాయతీ రాజ్, సీసీ రోడ్లకు, ఎన్ఆర్ఈజీఎస్పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. పాలమూరులో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ‘రోజుకో కార్యక్రమం’ పేరుతో నియోజకవర్గంలో పర్యటిస్తూ అభివృద్ధి పనులకు శిలాఫలకాలు ఆవిష్కరిస్తున్నారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు శేఖర్ రెడ్డి, గొంగిడి సునీత, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గ్యాదరి కిషోర్ కుమార్, ఉమ్మడి వరంగల్జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి , తాటికొండ రాజయ్య, మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, సిర్పూర్ టీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గ్రామ పర్యటనల్లో భూమిపూజలు, శంకుస్థాపనలు ఉండేలా చూసుకుంటున్నారు.
ఫండ్స్ లేకున్నా మభ్యపెడుతున్నరు
రాష్ట్ర సర్కారు నుంచి కొంతకాలంగా పంచాయతీలు, మున్సిపాలిటీలకు సరిపడా ఫండ్స్రావడం లేదు. అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు బిల్లులు రాక ఆందోళన చేస్తున్నారు. ఇక జిల్లాల పర్యటనల సందర్భంగా సీఎం కేసీఆర్సాంక్షన్ చేస్తున్న ఎస్డీఎఫ్(స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్), ఏసీడీఎఫ్(నియోజకవర్గ అభివృద్ధి నిధులు)తో నియోజకవర్గాల్లో చేపట్టిన మినీ లిఫ్టు స్కీములు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, అంగన్వాడీ సెంటర్లు, ఓపెన్ జిమ్స్, పల్లె దవాఖానాలు ఫండ్స్లేక ముక్కుతూ మూల్గుతూ సాగుతున్నాయి. ఎస్డీఎఫ్ కింద జిల్లాల్లో చేపట్టిన చాలా పనులు పెండింగ్‌పడ్డాయి. కొన్ని చోట్ల పునాదులు కూడా తీయలేదు. కానీ మళ్లీ ఈ రెండు స్కీముల కింద మంత్రులు, ఎమ్మెల్యేలు డెవలప్మెంట్ పనులకు శంకుస్థాపనలు, భూమి పూజ చేస్తుండడం విస్తుగొలుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఇస్తున్న ఈ జీఎస్ఫండ్సే చాలా పనులకు దిక్కవుతున్నాయి. గ్రామాల్లో ప్రస్తుతం సీసీ రోడ్లు, డ్రైనేజీలు, గ్రామ పంచాయతీ బిల్డింగులు, కమ్యూనిటీ హాళ్లు, చెక్‌డ్యాముల నిర్మాణానికి ఉపాధి నిధులే వాడుతున్నారు. తాజాగా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈజీఎస్పనులకు కూడా శంకుస్థాపనలు, భూమి పూజలు చేస్తూ బిల్డప్ ఇస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే ఎన్నికల కోసమే కొత్త శిలాఫలకాలు వేస్తున్నారని, అంతకుముందు పాత శిలాఫలకాల సంగతేందో చూడాలని ప్రజలు అడుగుతున్నారు.
జూలై 14, 2022. ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పాలమూరు జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా భూత్పూర్లో రూ.2 కోట్లతో సమీకృత మార్కెట్ నిర్మాణానికి, సీసీకుంట మండలంలో రూ.60 కోట్లతో పేరూరు స్కీం పనులకు, అడ్డాకుల మండలంలో రూ.4 కోట్లతో వర్నె-ముత్యాలంపల్లి మధ్య రోడ్ కం బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆరు నెలలు అవుతున్నా.. ఇంతవరకు ఈ పనులు ముందుకు పడలేదు.
జనవరి 31, 2023. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా అడవి హజిలాపూర్ గ్రామంలో రూ.5 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామ సమీపంలో రూ.20 లక్షలతో చెక్ డ్యామ్ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టారు. దీంతో పాత పనుల సంగతేందని జనం ప్రశ్నిస్తున్నారు.