యువతకు ఉద్యోగావకాశాలపై ఎమ్మెల్యేలు, మంత్రుల ఫోకస్

యువతకు ఉద్యోగావకాశాలపై ఎమ్మెల్యేలు, మంత్రుల ఫోకస్
  • టీజీ స్టెప్ ద్వారా తమ నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు
  • నేడు హుస్నాబాద్ లో, రేపు మానకొండూర్​లో జాబ్ మేళా
  • 60కిపైగా కంపెనీలు, 5 వేలకుపైగా ఉద్యోగాలు

కరీంనగర్, వెలుగు: నిరుద్యోగ యువతకు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా జాబ్ మేళాలు మొదలుపెట్టగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం టీజీపీఎస్ సీ నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తూ, పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 

మరోవైపు ప్రెవేట్ రంగంలోనూ జాబ్స్ ఇప్పించేందుకు ఎమ్మెల్యేలు, మంత్రులు పలు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి.. నియోజకవర్గ కేంద్రాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. యువజన సర్వీసుల శాఖ నిర్వహించే ఈ జాబ్ మేళాను తెలంగాణ సొసైటీ ఫర్ ట్రెయినింగ్ అండ్ ఎంప్లాయ్ మెంట్ ప్రమోషన్(టీజీ స్టెప్) ఆర్గనైజ్ చేస్తోంది.  ఇటీవల సిరిసిల్ల జిల్లాకేంద్రంలోనూ పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ ఆధ్వర్యంలో జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేళా నిర్వహించారు. 

టెన్త్​ టు పీజీ చదివిన వారికి అవకాశం  

హుస్నాబాద్ నియోజకవర్గ జాబ్ మేళాను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి హుస్నాబాద్ లోని తిరుమల గార్డెన్స్ లో  మెగా జాబ్ మేళా నిర్వహించబోతున్నారు. 60కి పైగా కంపెనీల ప్రతినిధులు ఈ జాబ్ మేళాకు హాజరుకానున్నారు. 5వేలకు పైగా ఉద్యోగాలు కల్పించనున్నారు. టెన్త్​,  డిప్లొమా, బీటెక్,ఎంటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, హోటల్ మేనేజ్ మెంట్ సహా అన్ని రకాల విద్యార్హతలు ఉన్నవారు ఈ జాబ్ మేళాకు హాజరుకావొచ్చు. 

అభ్యర్థులు సమాచారం కోసం 9030047303, 9642333668 నంబర్లను సంప్రదించవచ్చు. మానకొండూర్​ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండలం కొత్తపల్లెలోని సాయిరామ్ గార్డెన్స్ మంగళవారం జాబ్ మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ జాబ్ మేళాకు కూడా 60కి పైగా కంపెనీల ప్రతినిధులు హాజరై 5 వేలకు పైగా ఉద్యోగావకాశాలు  కల్పించనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఇక్కడికి వచ్చే అభ్యర్థులు సమాచారం కోసం 7288921431, 9030047304 నంబర్లను సంప్రదించవచ్చని వెల్లడించారు. 

జాబ్ మేళాను వినియోగించుకోండి


నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకే జాబ్ మేళాలను నిర్వహిస్తున్నాం. ఈ జాబ్ మేళా హుస్నాబాద్ నియోజకవర్గం లోని యువతకు ఓ సువర్ణ అవకాశం. చదువుకు, స్కిల్స్ కు తగిన ఉద్యోగం చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుని కుటుంబానికి అండగా నిలవాలి. రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తూనే ప్రైవేట్ రంగంలనూ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. - పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి