శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బిజీ

  • ప్రజా సమస్యలపై ఇంటింటికీ బీజేపీ 
  • బండి సంజయ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది సస్పెన్స్ 
  • బీఆర్ఎస్ లో ఇద్దరు సిట్టింగ్ లకు టికెట్ టెన్షన్
  • బీఆర్ఎస్, బీజేపీ బీఫాంల కోసం హోరాహోరీ పోటీ
  • ఉనికి చాటుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నం

కరీంనగర్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు ఎనిమిది నెలల ముందే కరీంనగర్ జిల్లాలో పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొత్త పనులకు శంకుస్థాపనలు చేయడం, పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు చేసే పనిలో ఉన్నారు. జిల్లాలో హుజూరాబాద్ బై ఎలక్షన్ తర్వాత కాస్త డీలాపడ్డ రూలింగ్​ పార్టీ నేతలు రెండు నెలలుగా విస్తృతంగా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ నియోజకవర్గాన్ని వదిలి వెళ్లడం లేదు. రోజూ ఏదో ఒక ప్రోగ్రామ్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రతి రోజూ తెల్లవారుజూమునే ప్రజలను కలిసేందుకు ‘పొద్దు పొడుపు’ అనే కార్యక్రమం నిర్వహిస్తుండగా, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ‘తొలి పొద్దు’ ద్వారా జనాలకు చేరువవుతున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తుండగా.. ఈ సారి ఎలాగైనా ఎమ్మెల్యే కావాలనే కసితో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు. తాజాగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను ఆహ్వానించి జమ్మికుంటలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. 

కరీంనగర్ లో గంగుల వర్సెస్ బండి

కరీంనగర్​లో గంగుల కమలాకర్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. మరోసారి ఎన్నికల బరిలో నిలిచి గెలిచేందుకు నిత్యం జనంలో ఉంటున్నారు. గంగుల తన సమీప అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పై 2014 ఎన్నికల్లో 24,764 ఓట్ల మెజార్టీతో, 2018 ఎన్నికల్లో 14,974 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అనంతరం 2019లో లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి బండి సంజయ్ విజయం సాధించారు. రాష్ట్రంలో మారిన రాజకీయ వాతావరణం, బీజేపీ సంస్థాగతంగా బలోపేతమైన పరిస్థితుల్లో సంజయ్ మరోసారి కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మాత్రం ఈ సారి గంగులకు టఫ్ ఫైట్ తప్పేలా లేదు. కానీ సంజయ్ వచ్చే ఎన్నికల్లో వేములవాడ, ఎల్ బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఒకవేళ ఆయన మరోచోట బరిలోకి దిగితే ఈ స్థానంలో బీజేపీ నుంచి కరీంనగర్ సిటీకి చెందిన కొత్త జయపాల్ రెడ్డి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి 2018 ఎన్నికల్లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పోటీ చేశారు. అయితే ఈ సారి ఆయన పార్లమెంట్ స్థానానికే పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఆయన ఎంపీగా పోటీ చేస్తే కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ సిటీ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి, పీసీసీ మాజీ ప్రెసిడెంట్ దివంగత ఎంఎస్ఆర్ మనమడు మెన్నేని రోహిత్ రావు, టీపీసీసీ సెక్రటరీ, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ వైద్యుల అంజన్ కుమార్ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. 

చొప్పదండిలో సిట్టింగ్, మాజీల మధ్యే పోటీ 

చొప్పదండి నియోజకవర్గ ఓటర్లు వరుసగా ఐదుసార్లు సిట్టింగ్​లను కాదని కొత్తవాళ్లకు అవకాశమిస్తూ వస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన పలు హామీలు అమలు చేయకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పై ప్రజల్లో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ టికెట్ ఆయనకు కాకుండా కొత్తవారికి ఇస్తారని కొద్ది నెలలుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రవి శంకర్ మాత్రం తనకే టికెట్ వస్తుందని, తప్పక గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చొప్పదండి బీఆర్ఎస్ టికెట్ కోసం రామడుగు మండలం వెలిచాలకు చెందిన మాజీ ఎంపీటీసీ బండపెల్లి యాదగిరి, ఇదే మండలం వెదిరకు చెందిన శనిగరపు ప్రకాశ్, బోయినపల్లి జడ్పీటీసీ కత్తెరపాక ఉమ భర్త కొండయ్య పోటీ పడుతున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ నియోజకవర్గంలో వాల్ రైటింగ్ రాయిస్తూ, క్రికెట్ మ్యాచ్ లు పెడుతూ యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. చొప్పదండి నియోజకవర్గంలో బీజేపీకి మంచి ఓటు బ్యాంకు ఉంది. ఇక్కడి నుంచి బీజేపీ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభక్క గాలన్న, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం, ఎన్ఎస్ యూఐ లీడర్ నాగి శేఖర్, వెదిరకు చెందిన వెన్నం రాజమల్లయ్య పోటీ పడుతున్నారు. 

మానకొండూరు బీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు 

రసమయి బాలకిషన్ మానకొండూరు ఎమ్మెల్యేగా రెండుసార్లు విజయం సాధించారు. రెండుసార్లు రసమయికి ప్రత్యర్థిగా ఉన్న ఆరేపల్లి మోహన్ 2019 మార్చిలోనే టీఆర్ఎస్ లో చేరారు. ఈసారి బీఆర్ఎస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీలో ఉన్న ఓరుగంటి ఆనంద్ పోయినసారి ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ ఆయనకు ఆహార భద్రత కమిషన్ మెంబర్ గా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు. ఈసారి తనకే టికెట్ వస్తుందని ఆశిస్తున్నారు. రసమయికి వీరిద్దరితో అసమ్మతి తలనొప్పిగా మారింది. మరోవైపు  రసమయికి  కొద్దిరోజులుగా ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సమస్యలపై ప్రజలు నిలదీస్తే వారిని నోటికొచ్చినట్లు తిట్టడం, పోలీసులతో కేసులు పెట్టించి ఇబ్బంది పెట్టిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. రసమయికి టికెట్​వస్తే ఈసారి కాంగ్రెస్​ నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ రూపంలో గట్టి పోటీ ఎదురుకానుంది. 

హుజూరాబాద్‌‌‌‌ లో ఈటల వర్సెస్ పాడి

మాజీ మంత్రి ఈటల రాజీనామాతో హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగిన బై ఎలక్షన్ రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపాయి. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఈటల చేతిలో పరాజయం పాలయ్యారు. దీంతో ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా భావించిన బీఆర్ఎస్ హైకమాండ్​ జనవరి 31న జమ్మికుంటలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో గెల్లును కాదని తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వచ్చే ఎన్నికలు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిగానే జరగబోతున్నాయి.  టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ బైఎలక్షన్ లో గెలిచాక.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. దీంతో సొంత నియోజకవర్గంపై ఫోకస్​ తగ్గిందనే అభిప్రాయాలు
 వినిపిస్తున్నాయి. 

చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్  

అనుకూల అంశాలు 

  •     స్థానికుడు, పార్టీ పెద్దలతో సత్సంబంధాలు
  •     పొద్దు పొడుపు పేరుతో నేరుగా ప్రజల వద్దకు వెళ్లడం 
  •     టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు

ప్రతికూల అంశాలు

  •     అభివృద్ధి పనులు నత్తనడక
  •     ఇక్కడ ఒక్కసారి గెలిచినవారు మరోసారి గెలవకపోవడం
  •     అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం
  •     గతంలో ఇతని టికెట్ కోసం సహకరించిన వారిలో చాలామంది ప్రస్తుతం దూరమవడం
  •     కార్యకర్తల్లో సమన్వయ లోపం
  •     నెరవేరని డిగ్రీ కాలేజీ, డబుల్ బెడ్రూం ఇళ్లు, కొత్త మండలాల ఏర్పాటు హామీలు

మానకోండూరు ఎమ్మెల్యే రసమయి 

అనుకూల అంశాలు

  •     తొలి పొద్దుతో ఉదయమే ప్రజల్లోకి వెళ్లి కల్యాణ లక్ష్మి చెక్కులు, ఆడబిడ్డ సారె అందజేయడం
  •     సీఎం కేసీఆర్, కేటీఆర్, పార్టీ పెద్దలతో సత్సంబంధాలు కలిగి ఉండడం 

ప్రతికూల అంశాలు 

  •     డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం
  •      చేపట్టకపోవడం, దత్తత తీసుకున్న గ్రామాలను పట్టించుకోకపోవడం 
  •     నమ్ముకున్న అనుచరులకు ఎలాంటి సాయం చేయకపోవడం
  •     ప్రజల నుంచి నిరసనలను సహించలేకపోవడం 
  •     సొంత పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులను దుర్భాషలాడడం

కరీంనగర్​ఎమ్మెల్యే గంగుల

అనుకూల అంశాలు 

  •     కరీంనగర్ సిటీలో రోడ్లు, డ్రైనేజీలను నిర్మించడం
  •     నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు కలిగిన మున్నూరుకాపు కులానికి చెందిన నేత 
  •     ముస్లిం సామాజికవర్గానికి దగ్గరగా ఉండడం

ప్రతికూల అంశాలు

  •     నిరుద్యోగులు, యూత్ బీజేపీ వైపు మొగ్గు చూపడం
  •     ముస్లింలకు అనుకూలంగా ఉండడంతో హిందూ ఓటుబ్యాంకు దెబ్బతినే అవకాశం

హుజూరాబాద్​ ఎమ్మెల్యే ఈటల 

అనుకూల అంశాలు 

  •     అన్నివర్గాల కార్యకర్తలకు అందుబాటులో ఉండడం 
  •     పేద, మధ్య తరగతి వారికి విద్య, వైద్యం విషయంలో సహకరించడం
  •     వ్యక్తిగతంగా ఎవ్వరికైనా సాయం చేయడం

ప్రతికూల అంశాలు 

  •     చెప్పుడు మాటలతో ఆప్తులను దూరం చేసుకోవడం 
  •     2001 నుంచి ఆయన వెంట ఉన్న క్యాడర్ 2021 తర్వాత దూరం కావడం 
  •     ఈటలకు బైఎలక్షన్ తో పోలిస్తే నియోజకవర్గంలో  సానుభూతి తగ్గడం