
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నిత్యకృత్యంగా పార్టీలు ఫిరాయించడం ప్రజాస్వామ్యానికే కళంకం. చట్టాలలో కఠినత్వం, స్పష్టత కొరవడడంతో పార్టీ ఫిరాయింపులు పెరిగిపోతున్నాయి. ప్రజాస్వామ్య విలువలు తగ్గి నైతికత లేకుండా పోతున్నది. ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఉన్న నిబంధన ఏమిటి? వాటి అమలు గురించి ఏ రకమైన చర్యలు చేపడుతున్నారు. ఎవరి పర్యవేక్షణలో అమలు జరగాలనేది కీలకంగా మారింది.
వేగంగా కేసులు పరిష్కరించి తగిన చర్యలు సత్వరం తీసుకోకపోవడం వలన అందులోని లోపాలను ఆసరా చేసుకుని రోజురోజుకూ ఫిరాయింపులు పెరిగిపోతున్నవి. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలదే కీలక పాత్ర. వాటి ద్వారానే స్థానిక సంస్థల నుంచి అత్యున్నత పార్లమెంటు వరకు ప్రజల ఓట్ల ద్వారా ప్రజాప్రతినిధులు ఎన్నికవుతున్నారు.
52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 1985వ సంవత్సరంలో ముందుచూపుతో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయిననప్పటికీ ఫిరాయింపులు దినదినం పెరిగిపోవడం గమనార్హం. ప్రజల ద్వారా ప్రజల కోసం ప్రభుత్వాలు ఏర్పడాలి. కానీ, ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం ఏర్పడుతున్నది.
ఫిరాయింపుల నిరోధక చట్టం ఎందుకు సరిగ్గా అమలుకావడం లేదు? అధికారంలో ఉన్నవారికి ఒక న్యాయం, ప్రతిపక్షంలో ఉన్నవారికి మరొక న్యాయం అనేది చట్టంలో ఎక్కడా లేదు. కానీ, అధికారంలో ఉన్నవారు చట్టాలను తమకు అనుకూలంగా వాడుకొని ప్రశ్నించే గొంతుకలను నొక్కడం, లేకుంటే తమ పరిధిలో ఉన్న సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి సంస్థల ద్వారా దాడులు చేయించి భయభ్రాంతులకు గురిచేయడం జరుగుతోంది.
ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటమంటే ప్రజాస్వామ్య విలువలు మంట కలపడమే అవుతుంది. నిస్వార్థంగా పనిచేసే ప్రజాసేవకులు కనుమరుగవుతున్నారు. ప్రజాభక్షకులు ప్రతినిధులుగా ఎన్నికకావడం వలన ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం ఏర్పడుతున్నది.
సుప్రీంకోర్టు జోక్యం
ఒక వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే అదే పార్టీలో కొనసాగాలి. లేకపోతే గెలిచిన పదవికి రాజీనామా చేసి పార్టీ మారాలి. అంతేతప్ప తమకు ఇష్టం ఉన్నట్టు వ్యవహరించడానికి అవకాశం ఉండకూడదు. పార్టీ ఫిరాయింపుల చట్టంలో పేర్కొన్న క్రమంలో గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులలో 2/3శాతం మంది మారితే పార్టీ మారడానికి విలీన హక్కు ఉన్నది.
తెలంగాణలో గతంలో టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితిని చూశాం. అప్పుడు కూడా పార్టీలు కోర్టుకు వెళ్లినా కాలయాపన జరిగింది. సకాలంలో కోర్టులు తీర్పు ఇవ్వలేకపోయాయి. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో జరిగిన వాదోపవాదాలను గమనిస్తే స్పీకర్‌కు ఉన్న నిర్ణయాధికారం ప్రకారం తక్షణమే చర్యలు చేపట్టాలి. సముచిత సమయమని వెసులుబాటుతో వ్యాఖ్యానాలు చేయడం విడ్డూరంగా ఉంది. కోర్టు కూడా దానిని గమనించి సముచిత సమయమంటే ఏమిటి సమాధానం చెప్పమనడం స్పీకర్ వ్యవస్థకు మచ్చలాంటిదే.
ఏదేమైనా నిర్ణీత గడువులోగా పరిష్కరించకుంటే, తామే గడువు విధిస్తామని సుప్రీంకోర్టు చొరవ తీసుకోవడం ముదావహం. గతంలో ప్రతిపక్షంలో ఫిరాయింపు వ్యవహారంలో పీడిత పక్షంగా ఉన్న పార్టీలు అధికారంలోకి వచ్చాక ఆ పంథానే ఎంచుకుంటే వాటికే నష్టం. ఫిరాయింపుదారులతో రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలో తమ విధానాలతో మెప్పించి వారిని గెలిపించుకోవడం ద్వారా నూతన సంస్కృతికి బాటలు వేసుకోవాలి.
లేదంటే పాలకులు మారినా విధానాలు అవేనని, ప్రజాస్వామ్య వ్యవస్థపైనే ప్రజలు నిరాశ, నిస్పృహలకు గురయ్యే ప్రమాదం ఉన్నది. నాడు ప్రధానిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ ఫిరాయింపుల నిరోధానికి చట్టం తీసుకువచ్చిన బాటలోనే ఫిరాయింపులకు ప్రజాతీర్పును దక్కించుకోవడం ద్వారా శభాష్ అనిపించుకోవాలి.
రాజకీయ పార్టీల విధానాలపై చర్చ జరగాలి
ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఉన్న లొసుగులు నేరపూరిత చరిత్ర కలిగినవారికి ఒక అవకాశంగా కనపడుతోంది. ప్రభుత్వాలు మారుతున్నా రాజ్యాంగ మూల సూత్రాలకే విఘాతాన్ని కలిగిస్తూ పాలన చేస్తున్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను గమనంలోకి తీసుకొని ప్రభుత్వాలు స్పందించాలి.
చట్టాలలో పొందుపరిచిన లొసుగులను సవరించి పకడ్బందీగా చట్టాలను రూపొందిస్తే నేరపూరిత చరిత్ర కలిగినవారికి ప్రజా ప్రతినిధులుగా ఎన్నిక కావడానికి అవకాశం ఉండదు. అంతేకాకుండా ప్రత్యేక కోర్టులలో కేసుల పరిష్కారం వేగం పెంచి పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించాలి. ఒక సంవత్సర కాలంలోగా కేసులు పరిష్కరించాలి. కేసుల తీవ్రతను బట్టి విచారణ వేగంగా జరగాలి. మేధావులు, బుద్ధిజీవులు చట్టాలలో ఉన్న లొసుగులను ఎత్తిచూపుతూ రాజకీయ ప్రక్షాళనకు తమవంతు బాధ్యతలను నిర్వర్తించాలి.
2018లోనే ప్రత్యేక కోర్టులు
పార్టీ ఫిరాయింపులకు తోడు రాజకీయాల్లో నేరపూరితులను ఎన్నుకుంటూపోతే ఈ దేశ భవిష్యత్తు ఇబ్బందులలో పడినట్టే. ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం ఒక వ్యక్తి తీవ్రమైన నేరాల్లో దోషిగా తేలితే అతడిని పదవి నుంచి తొలగించవచ్చు. కానీ. అమలు విషయంలో జాప్యం మనం చూస్తున్నాం.
ఇప్పటికీ దేశవ్యాప్తంగా 5,000కు పైగా నేరపూరిత చరిత్ర కలిగిన ప్రజా ప్రతినిధుల కేసులు వివిధ కోర్టులలో పెండింగ్‌లో ఉన్నాయి. దీన్ని గమనిస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం ఎంత పటిష్టవంతంగా అమలవుతుందో అర్థం అవుతుంది. 2018లోనే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి నేరపూరిత కేసులను త్వరగా తేల్చాలని సుప్రీంకోర్టు సూచనతో 12 ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసినప్పటికీ కేసులు పరిష్కారంలో చాలా జాప్యం జరుగుతోంది.
రాజకీయ పార్టీలు నేర చరిత్ర కలిగిన అభ్యర్థులను ఎందుకు ఎంపిక చేశారో, అందుకు సరైన కారణాలు ఎన్నికల సంఘానికి తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నప్పటికీ రాజకీయ పార్టీలు ఖాతరు చేయడం లేదు. నైతికతను వదిలి రాజకీయ పార్టీలు నేరచరిత్ర ఉన్నవారిని తమ అభ్యర్థులుగా ప్రకటిస్తున్నాయి. దానిని నిరోధించే విషయంలో ఎన్నికల కమిషన్ కూడా పూర్తి బాధ్యతగా వ్యవహరించాలి. ఎన్నికలలో నేరపూరిత చరిత్ర కలిగినవాళ్లని పోటీకి దూరంగా ఉండేవిధంగా కఠినచర్యలు చేపట్టాలి.
- చాడ వెంకటరెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు-