రోజుకో ఊరిలో ఆసరా కార్డులు పంచుతున్న ఎమ్మెల్యేలు

  • పంపిణీ పూర్తయ్యేదాక పాతవారికి కూడా ఇవ్వొద్దని ఇంటర్నల్‌‌‌‌ ఆదేశాలు
  • ఇప్పటివరకు ఒక్కరికి కూడా అందని ఆసరా పెన్షన్‌‌‌‌
  • ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న లబ్ధిదారులు

యాదాద్రి, వెలుగు : ఆసరా పింఛన్‌‌‌‌ పైసలు రిలీజ్‌‌‌‌ అయినా, మరో వారం రోజుల్లో నెల ముగుస్తున్నా లబ్ధిదారులకు మాత్రం ఇప్పటివరకు చేతికి అందలేదు. యాదాద్రి జిల్లాలో గత నెల వరకు 83,457 మందికి ఆసరా పింఛన్‌‌‌‌ అందేది. ప్రభుత్వం 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు మంజూరు చేయడంతో ఇప్పుడు కొత్తగా 24,976 మందిని గుర్తించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారుల సంఖ్య 1,08,433కు చేరింది. వీరికి పంపిణీ చేసేందుకు రూ. 25 కోట్లు కూడా విడుదల అయ్యాయి. పైసలు వచ్చినా పింఛన్ల పంపిణీ మాత్రం స్టార్ట్‌‌‌‌ కాలేదు. అయితే కొత్త పింఛన్‌‌‌‌దారులకు కార్డుల పంపిణీ పూర్తయ్యేవరకు కొత్త వారితో పాటు, పాత వారికి కూడా పైసలు ఇవ్వొద్దని ఆఫీసర్లకు ఇంటర్నల్‌‌‌‌గా ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.

రోజుకోచోట కార్డుల పంపిణీ

కొత్తగా పింఛన్లు మంజూరైన వారికి ఆసరా గుర్తింపు కార్డు ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం ఎమ్మెల్యేలకు అప్పగించింది. ఇన్నాళ్లు అభివృద్ధి పనుల విషయంలో వెనుకబడి ప్రజల వద్దకు వెళ్లడానికి ముఖం చెల్లని లీడర్లు ఆసరా పింఛన్‌‌ గుర్తింపు కార్డుల పంపిణీని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు రోజుకో ఊరిలో లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేస్తూ పబ్లిక్‌‌‌‌లో ఇమేజ్‌‌‌‌ పెంచుకునేందుకు ప్లాన్‌‌‌‌ చేస్తున్నారు. దీంతో జిల్లాలో ఆసరా కార్డుల పంపిణీ ఆలస్యం అవుతోంది. 

ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు

కొత్త కార్డుల పంపిణీ కొనసాగుతుండడంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు ఒక్కరికి కూడా పెన్షన్‌‌‌‌ అందలేదు. దీంతో లబ్ధిదారులు ప్రతిరోజూ పోస్టాఫీస్‌‌‌‌, పంచాయతీ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పింఛన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేయాలో ఆఫీసర్లకే స్పష్టత లేకపోవడంతో లబ్ధిదారులకు కచ్చితమైన డేట్‌‌‌‌ చెప్పలేకపోతున్నారు. మొదట్లో ఈ నెల 21 వరకే పింఛన్ల పంపిణీ నిలిపివేయాలని పైనుంచి మెసేజ్‌‌‌‌ వచ్చిందని ఓ పోస్ట్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ చెప్పారు. ఆ తర్వాత మళ్లీ డేట్‌‌‌‌ మార్చారని చెబుతున్నారు. 

కొత్త వాళ్ల కోసం ఆపుతున్రు 

పింఛన్‌‌‌‌ కోసం వారం రోజులుగా పోస్టాఫీస్‌‌ చుట్టూ తిరుగుతున్న. రేపు మాపు అంటూ చెబుతున్నరు. కొత్త పింఛన్లు వచ్చిన వాళ్లకు కార్డులు ఇస్తున్నరు. వాళ్ల కోసం మాకు పింఛన్లు ఇవ్వడం లేదు.  ఎప్పుడు ఇస్తరో కూడా తెలియడం లేదు.

– వెంకయ్య, లబ్ధిదారుడు