- రెవెన్యూ , మున్సిపల్, పోలీస్, రిజిస్ట్రేషన్ల శాఖలపై సీఎంవోకు ఫిర్యాదుల వెల్లువ
- సీఎం రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ రిపోర్టు!
- ఎమ్మార్వోలు, ఆర్డీవోలు, మరికొందరు అధికారులపై ఇప్పటికే ఎంక్వైరీ మొదలు
- లిస్టులో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు
- ఈ 4 శాఖల ఆఫీసర్లపైనే ఎక్కువగా ఏసీబీ కేసులు
హైదరాబాద్, వెలుగు: నాలుగు ప్రభుత్వ శాఖల్లో ఎక్కువ మంది ఆఫీసర్లు అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కింది నుంచి పైస్థాయి వరకు అధికారులు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు, మున్సిపల్, పోలీస్ శాఖలు ఉన్నాయి. అవినీతి అధికారుల తీరును కొంతమంది ఎమ్మెల్యేలు సీఎంవో దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఏసీబీకి పట్టుబడుతున్న వారిలోనూ ఎక్కువగా ఈ నాలుగు శాఖల ఆఫీసర్లే ఉన్నారు. కొన్నింటిలో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇన్వాల్వ్ అవుతున్నట్టు ఇంటెలిజెన్స్ గుర్తించింది.
రెవెన్యూలో ధరణి అప్లికేషన్ల పరిష్కారానికి, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బిల్డింగ్లు, లేఅవుట్ల పర్మిషన్లకు, పోలీస్ శాఖలో కేసుల వ్యవహారాల్లో, రిజిస్ట్రేషన్ల శాఖలో భూముల రిజిస్ట్రేషన్లకు ప్రజలు లంచం ఇస్తేగానీ పని జరగడం లేదని ప్రభుత్వానికి కంప్లయింట్స్ అందుతున్నాయి. వీటిపై సీఎం రేవంత్‌రెడ్డికి సైతం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నివేదిక ఇచ్చినట్టు తెలిసింది.
దీంతో ఇప్పటికే రెవెన్యూలో ఎమ్మార్వో, ఆర్డీవో స్థాయి అధికారులపై.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పని చేస్తున్న కొందరు అధికారులపై ఎంక్వైరీ మొదలైంది. అయితే కొన్ని శాఖల్లో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు సైతం అవినీతికి పాల్పడుతున్నట్టు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది.
మున్సిపల్ శాఖలో అధికారుల ఇష్టారాజ్యం..
మున్సిపల్అడ్మినిస్ట్రేషన్ అండ్‌అర్బన్ డెవలప్మెంట్ (ఎంఏయూడీ) శాఖలో అధికారులు ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతున్నారు. జీహెచ్ఎంసీతో పాటు దాని చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో, గ్రేటర్వరంగల్, గ్రేటర్ నిజామాబాద్ కార్పొరేషన్లలో బిల్డింగ్పర్మిషన్లకు అధికారులు లంచాలు తీసుకుంటున్నారు. నిబంధనలన్నీ పాటించినా ఎంతో కొంత ఇస్తేనే పర్మిషన్లు ఇస్తున్నట్టు సీఎం దృష్టికి వచ్చింది.
హెచ్ఎండీఏ, నిజామాబాద్, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లోనూ లేఅవుట్ పర్మిషన్ల కోసం లంచాలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జీహెచ్ఎంసీకి ముగ్గురు కమిషనర్లు మారారు. అదే విధంగా రెండు, మూడు నెలల వ్యవధిలోనే సీడీఎంఏ కమిషనర్ బదిలీలు జరిగాయి. దీంతో క్షేత్రస్థాయిలో ఉండే అధికారుల అవినీతి పెరిగిపోయిందని చర్చ జరుగుతున్నది.
హెచ్ఎండీఏ కమిషనర్ పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ హెడ్ఆఫీస్లో ఉండే కొందరు సీఎం, సీఎం బంధువుల పేర్లు చెప్పి ఫైల్స్‌ను రన్ చేస్తున్నట్టు ఫిర్యాదులు అందాయి. కేవలం పర్మిషన్లలోనే కాకుండా ఇతర పనుల్లోనూ అక్రమాలు చేస్తున్నట్టు తేలింది.
రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల్లోనూ అదే తంతు..
రిజిస్ట్రేషన్ల శాఖలో కొంతమంది సబ్రిజిస్ర్టార్లు రిజిస్ర్టేషన్ చేసే క్రమంలో ఫైల్‌కు ఇంత అని ముందే ఫిక్స్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. గత నాలుగు నెలల కాలంలో రిజిస్ట్రేషన్ల శాఖలోనే ఏడుగురు ఏసీబీకి పట్టుబడ్డారంటే ఆ శాఖలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతున్నది. ఇదే విషయమై సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం సబ్రిజిస్ట్రార్లను మందలించారు. తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.
అయినా అర్ధరాత్రులు అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. సాధారణ రిజిస్ర్టేషన్లలోనూ వసూళ్లకు పాల్పడుతున్నారు. జిల్లా రిజిస్ర్టార్లకు కంప్లయింట్ చేసినా ఫలితం లేకుండా పోతున్నదని బాధితులు వాపోతున్నారు. అందులో భాగంగానే సబ్‌రిజిస్ట్రార్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇక రెవెన్యూ శాఖలో ధరణిలో పెట్టుకుంటున్న ప్రతి అప్లికేషన్‌కు ఎమ్మార్వో ఆఫీసుల నుంచి కలెక్టర్‌ఆఫీసుల దాకా ఎంతో కొంత ముడితేనే అప్రూవల్స్ఇస్తున్నట్టు ఇంటెలిజెన్స్ గుర్తించింది.
రిపోర్ట్ రాయాలన్నా, రాసిన రిపోర్ట్‌ను అప్రూవ్ చేయాలన్నా లంచం ఇచ్చుకోవాల్సిందే. సెక్షన్ ఆఫీసర్లతో పాటు అధికారులు సైతం ఈ వ్యవహారాల్లో ఉంటున్నట్టు తెలిసింది. కొన్నింటిలో నేరుగా కలెక్టర్లు ఇన్వాల్వ్ అవుతున్నారనే సమాచారం సీఎంకు రేవంత్‌రెడ్డికి అందింది. ఈ నేపథ్యంలోనే అలాంటి కలెక్టర్లను ఎప్పటికప్పుడు బదిలీ చేస్తున్నారు. ల్యాండ్‌రేట్లు కోట్లలో పలుకుతున్న జిల్లాల్లోని రెవెన్యూ యంత్రాంగంపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు తెలిసింది.
పోలీసు శాఖలో అక్రమ దందాలు..
పోలీసు శాఖలోనూ అవినీతి, అక్రమ దందాలు ఎక్కువైనట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. పోలీసు స్టేషన్లలో సీఐలు, ఎస్సైలు సివిల్ వ్యవహారాల్లో తలదూర్చి అవినీతికి పాల్పడుతున్నట్టు తెలిసింది. అంతే కాకుండా ఏదైనా కంప్లయింట్తీసుకుంటే.. దాంట్లో ప్రోగ్రెస్ జరగాలన్నా, యాక్షన్ తీసుకోవాలన్నా, ఎఫ్ఐఆర్ నమోదు చేయలన్నా లంచాలు డిమాండ్ చేస్తున్నారు. గత ఆరు నెలల కాలంలో ఈ ఫిర్యాదులు ఎక్కువ కావడంతో డీజీపీ ప్రత్యేక దృష్టి సారించారు. కొన్నిచోట్ల ఐపీఎస్‌లు సెటిల్మెంట్లు చేస్తున్నట్టు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్టు సీఎం దృష్టికి వచ్చింది.
నల్గొండ ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ వ్యవహారంపైనా ప్రభుత్వం ఆరా తీస్తున్నది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పనిచేస్తున్న ఐపీఎస్‌లతో పాటు కింది స్థాయి పోలీసు అధికారుల వ్యవహార శైలిపై నిఘా పెంచారు. నేరుగా ప్రజలతో లింక్ ఉన్న ఈ నాలుగు శాఖల్లో అవినీతి, అక్రమాలు ఎక్కువగా ఉండటంపై సీఎం రేవంత్ రెడ్డి సైతం సీరియస్‌గా ఉన్నట్టు తెలిసింది. ఇలాంటి విషయాల్లో కఠినంగా వ్యవహరించాలని సీఎంవో అధికారులను ఆదేశించినట్టు తెలుస్తున్నది.