= 2 రోజులుగా, 2 సెగ్మెంట్లలో అ‘టెన్షన్’
= అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన దానం
= కాంగ్రెస్ నేతలపై మాట జారిన గూడెం?
= క్యాంప్ ఆఫీసులో పింక్ చైర్లు.. కేసీఆర్ ఫొటో
= ముట్టడించిన కార్యకర్తలు.. పింక్ చైర్లు ధ్వంసం
= ఆఫీసులో సీఎం రేవంత్ ఫొటో ఏర్పాటు
= ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనానికి యత్నం
= సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో తీవ్ర ఉద్రిక్తత
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఇద్దరు ఎమ్మెల్యేల తీరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రెండు రోజులుగా వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. నిన్న చింతల్ బస్తీలో జీహెచ్ఎంసీ, పోలీసు, ట్రాఫిక్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఫుట్ పాత్‌లు ఆక్రమణలను తొలగించారు. ఈ సమాచారం తెలుసుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అక్కడికి చేరుకొని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బతుకొచ్చిన వాళ్లపై దౌర్జన్యం చేస్తరా..? నా పర్మిషన్ లేకుండా ఎలా కూల్చివేస్తరు.. ఆపకుంటే ధర్నా చేస్తానని హల్ చల్ చేస్తానని బెదిరించారు. ఇవాళ కూడా అదే స్వరం వినిపించారు. అధికారులపై విరుచుకు పడ్డారు. ఓల్డ్ సిటీలో ఆక్రమణలు ఉన్నాయని, మొదట వాటిని కూల్చాలని డిమాండ్ చేశారు. అధికారులకు ఆజమాయిషీ లేకుండా పోయిందంటూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. అలానే వ్యవహరిస్తే ప్రభుత్వం ఇబ్బందులు పడుతుందన్నారు. అధికారులు చేసే పనుల వల్ల మేం జనాల్లో తిరగలేక పోతున్నామని అన్నారు. నిన్న హైదరాబాద్ వాడినే ఇక్కడ అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోనంటూ హెచ్చరించారు.
ఇదిలా ఉండగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తీరునూ స్థానిక కాంగ్రెస్ నేతలు తప్పు పడుతున్నారు. అందరినీ కలుపుకొని వెళ్లడం లేదని, నిన్న ఐడీఏ బొల్లారంలో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలనే తిట్టారని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే తన క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను కూడా పెట్టలేదని కాటా వర్గం ఆరోపించింది. పార్టీ మారి వచ్చిన గూడెం తన అనుచర వర్గంతో కాంగ్రెస్ నాయకులపై దాడులు చేయిస్తున్నారని చెబుతున్నారు. మహిపాల్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ మరోవర్గం ఆందోళనకు దిగింది. ఈ క్రమంలో క్యాంప్ ఆఫీసుకు తరలివెళ్లారు.
ALSO READ | కరీంనగర్ లో రాజకీయ విమర్శలు చేయను: కేంద్ర మంత్రి బండి సంజయ్
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్న తన క్యాంప్ ఆఫీసులో ఇంకా కేసిఆర్ ఫోటో ఉండడమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. సీఎం ఫొటో పెట్టడం ఇష్టం లేకపోతే పార్టీకి రాజీనామా చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోకి చొరబడి సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను ఎమ్మెల్యే సీటుపైనే ఉంచారు. ఆఫీసులో ఉన్న గులాబీ రంగు కుర్చీలను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు.
గాంధీభవన్ వద్ద సెక్యూరిటీ టైట్
గూడెం మహిపాల్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ పటాన్ చెరుకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీభవన్‌కు వచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఘర్ వాపసీ ఉండదన్న కేటీఆర్
పార్టీ మారిన ఎమ్మెల్యేలను తిరిగి తీసుకోబోమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవలే కుండ బద్దలు కొట్టారు. అంతే కాకుండా 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రానున్నాయని కూడా చెప్పారు. ఇందుకోసం బీఆర్ఎస్ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. ఈ తరుణంలో దానం, గూడెం వ్యవహరిస్తున్న తీరు హాట్ టాపిక్‌గా మారింది.