హైదరాబాద్, వెలుగు: శాసన సభలో మంగళవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ జీరో అవర్ లో ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ సమస్యలను ప్రస్తవించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గానికి తలాపున కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నా.. ఆయకట్టుకు చుక్క నీరు అంద లేదన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ ఉస్మానియా ఆస్పత్రిని అదే స్థలంలో పునర్‌నిర్మించాలని కోరారు. గోషామహల్ గ్రౌండ్‌లో నూతన ఆస్పత్రి నిర్మిస్తే.. స్థానికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.
దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ కోరాట– చనాక ప్రాజెక్టు 90 శాతం పూర్త అయ్యిందని, ప్రభుత్వం త్వరగా ఆ ప్రాజెక్టు పూర్తి చేసి 50 వేల ఎకరాలు సాగులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని గోకారం విలేజీలో రిజర్వాయర్ నిర్మిస్తామని చెప్పారని. దాన్ని నిర్మిస్తే ఎర్రవెల్లి ముంపు గ్రామాల్లో ప్రజలకు ఆర్ఆర్ పాకేజీ కింద ఇండ్లు కట్టిస్తారా.. ఇవ్వరా.. అనేది తేల్చాలన్నారు.
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ మోత్కురుకు బస్ డిపో మంజూరు చేసినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మోత్కురు డివిజన్ చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం అమలు చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కొత్తగూడెం, పాల్వంచ జంట నగరాలుగా ఉంటాయి.
గత 20 ఏండ్లుగా అక్కడ ఎన్నికలు జరగడం లేదు. పాల్వంచలో ఎన్నికలు జరపాలని కోరారు. బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ, సీడీపీ ఫండ్ విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ మాట్లాడుతూ, తమ నియోజకవర్గంలోని ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేస్తే మరింత ఆయకట్టు సాగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
పెద్దవాగు ప్రాజెక్టును డెవలప్ చేయాలి: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
అశ్వారావుపేట మండలంలోని 13 వేల ఎకరాల ఆయకట్టు కలిగిన పెద్దవాగు ప్రాజెక్టును డెవలప్ చేయాలని ఎమ్మెల్యే జారే ఆది నారాయణ కోరారు. 3 నెలల క్రింద భారీ వర్షాలతో ఆ ప్రాజెక్టు కుంగిపోయిందన్నారు. వేల ఎకరాల పంట వరద నీటిలో కొట్టుకుపోయిందన్నారు. ప్రభుత్వం తాత్కాలికంగా రింగ్ బండ్ ఏర్పాటు చేసింది.శాశ్వత రిపేర్లు చేయించి రైతులను ఆదుకోవాలన్నారు. అలాగే అశ్వారావు పేటకు దాదాపు 45 కి.మీ. దూరంలో ఉన్న ఆదివాసీ ప్రాంతం కావడిగుండ్లకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.