డెక్కన్ హోటల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడు నందకుమార్
హైదరాబాద్ : మొయినాబాద్ ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అరెస్ట్ అయిన నందకుమార్ అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. నందకుమార్ చేపట్టిన అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. నిర్మాత దగ్గుపాటి సురేశ్ బాబుకు చెందిన స్థలాన్ని లీజుకు తీసుకున్న నందకుమార్.. డెక్కన్ హోటల్ కిచెన్ కోసం రెండు అక్రమ నిర్మాణాలు చేపట్టారని అధికారులు గుర్తించి.. వాటిని కూల్చివేయించారు. అక్రమ నిర్మాణాలపై నోటీసులు ఇచ్చినా పనులు ఆపకుండా కొనసాగిస్తుండంతో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతల ప్రక్రియ చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. కోర్టు ఆదేశాలతోనే తాము అక్రమ నిర్మాణాలను కూల్చివేయించామని అధికారులు తెలియజేశారు.
ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు మరిన్ని ఆధారాల కోసం నిన్న రాత్రి నుంచి నందకుమార్ ఇంటితోపాటు ఆయన నిర్వహిస్తున్న డెక్కన్ హోటల్ లోనూ తనిఖీలు చేయగా అక్రమ నిర్మాణాలు విషయం బయటపడింది. దీంతో ఇవాళ ఉదయమే జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది నోటీసులు ఇచ్చినా.. నిర్మాణ పనులు ఆపకుండా కొనసాగించారు. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది జేసీబీలను తీసుకొచ్చి కూల్చివేతలు చేపట్టారు.
మరోవైపు.. ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో ముగ్గురు నిందితుల బెయిల్ పిటిషన్ పై తీర్పును ఏసీబీ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసు సీబీఐ పరిధిలోకి రాదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అంతేకాదు.. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ బి.ఫారంతో గెలిచారని, ఆయనకు ఫిర్యాదు చేయడానికి ఎలాంటి అర్హత లేదని పిటిషనర్ కోరారు. ఈ కేసు చెల్లదని, బెయిల్ మంజూరు చేయాలని పిటిషనర్ కోరగా.. బెయిల్ పిటిషన్ పై తీర్పును కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.