కోల్‌బెల్ట్: దేవుని దయతో మంచి దారిలో పోవాలని, ప్రజల కోసం పనిచేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల పట్టణంలోని గోపాల్ వాడలో షారోను ప్రార్థన మందిరంలో జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి లను గజమాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. పాస్టర్ల సమస్యలను ఎమ్మెల్యే గడ్డం వినోద్ తో కలిసి పరిష్కారిస్తామన్నారు. తాను చెన్నూర్‌లో గెలవాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని పాస్టర్స్ తమవంతు ప్రయత్నాలు చేశారని ఆయన చెప్పారు. ఏసు ప్రభువు ప్రవచనాలను పాస్టర్స్ ప్రజల్లోకి తీసుకువెళ్లి సమాజం సన్మార్గంలో నడిచేలా చేస్తున్నారని కొనియాడారు.
చెన్నూరు లో చాలా మంది పాస్టర్స్ తన గెలుపు కోసం పనిచేశారన్నారు. పాస్లర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మన దేశంలో తోటి వారిని ఆదుకునే విధానం ఉందన్నారు. కలిసి కట్టుగా అందరికి సహకరించాలని ఆయన కోరారు. మా అన్నదమ్ములను పిలిచి సన్మానించడం సంతోషంగా ఉందన్నారు.
అనంతరం ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ తాము చిన్నతనంలో క్రిస్టియన్ స్కూల్ లో చదువుకున్నామన్నారు. దేవుడి దయ ప్రజలందరిపై ఉంటుందన్నారు. భవిష్యత్ లో ప్రజలను ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచిస్తున్నామన్నారు.సమాజంలో పేదరికం తొలగించేందుకు సమిష్టి కృషి అవసరమని ఆయన చెప్పారు.