పెద్దపల్లి జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కొత్త తలనొప్పి వచ్చిపడింది. అటు పెద్దపల్లి, ఇటు రామగుండం ఎమ్మెల్యేలను సెకండ్ క్యాడర్ ఏమాత్రం లెక్కచేయట్లేదట. ఐదేండ్లుగా తమను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారని ఆయా గ్రామ, మండల, పట్టణ స్థాయి నాయకులు ఎమ్మెల్యేలపై గుర్రుగా ఉన్నారు. గ్రామాల్లో, కాలనీల్లో అభివృద్ధి పనులు చేపట్టిన నేతలు వాటికి బిల్లులు రాక అప్పులపాలయ్యారు.
ఆదుకోవాలని పోతే ఎమ్మెల్యేలు ఏనాడూ పట్టించుకోలేదట. దీంతో ఇన్నాళ్లు కోపాన్ని కడుపులో దాచుకున్న సెకండ్ క్యాడర్ ఎన్నికల టైంలో చుక్కలు చూపిస్తున్నారని సమాచారం. ఇటీవల ఓ ఎమ్మెల్యే ఓ గ్రామానికి పోతే అక్కడి పార్టీ లీడర్లు ఎవరూ రాలేదట. పార్టీని నమ్ముకుంటే తమకు చిప్పే మిగిలిందని, ఖర్చులకు డబ్బులిస్తే తప్ప కాలు కదిపే ప్రసక్తే లేదని చెప్పడంతో ఎమ్మెల్యే దిమ్మదిరిగిందట. ఇప్పడీ విషయం ఆ నియోజకవర్గంలో హాట్‌టాపిక్‌గా మారింది.
పెద్దపల్లి, వెలుగు