యాదాద్రి/దేవరకొండ, వెలుగు : హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సోమవారం ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ గవర్నర్‌ను కలిసి బొకే అందజేశారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం
యాదాద్రి, వెలుగు : ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య ధీమా వ్యక్తం చేశారు. పలు పార్టీలకు చెందిన వ్యక్తులు సోమవారం కాంగ్రెస్‌లో చేరగా వారికి ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అయిలయ్య మాట్లాడుతూ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మళ్లీ గెలిచే పరిస్థితి లేదన్నారు. అందుకే క్రికెట్ పేరుతో యువతను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆలేరులో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు.
అడిగినంత ఇస్తే అడ్డురాం
యాదాద్రి జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్స్‌తో హెల్త్ సిబ్బంది బేరసారాలు
యాదాద్రి, వెలుగు :యాదాద్రి జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటల్స్‌లో రూల్స్ పాటించకపోవడం, ఆర్‌ఎంపీలు అర్హత లేని ట్రీట్‌మెంట్ చేయడం వల్ల ఓ వైపు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. మరో వైపు హెల్త్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులకు మాత్రం కాసులు కురిపిస్తోంది. రూల్స్ పాటించకపోవడంతో సీజ్ చేసిన, షోకాజ్ నోటీసులు జారీ చేసిన హాస్పిటళ్లతో బేరాలు మాట్లాడుకుంటున్నారు. తాము అడిగినంత ఇస్తే చాలు వెంటనే పేరు మార్చి పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. అలాగే కొందరు హెల్త్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది హాస్పిటళ్లు, డయాగ్నస్టిక్ సెంటర్ల పరిసరాల్లో తిరుగుతూ వాటిల్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. తమకు అక్కరకొచ్చే పని ఏదైనా కనిపించిందంటే చాలు వెంటనే రంగంలోకి దిగుతున్నారు. తాము అడిగినంత ఇస్తే ఎలాంటి చర్యలు ఉండవని, లేకపోతే హాస్పిటల్‌ను సీజ్ చేస్తామని బెదిరిస్తున్నారు.
వివరణ తీసుకోవాలన్న సాకుతో బేరసారాలు...
యాదాద్రి జిల్లాలో 110 హాస్పిటల్స్, 53 డయాగ్నస్టిక్ సెంటర్లు నడుస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఇటీవల ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు వికటించి పలువురు మహిళలు చనిపోవడంతో జిల్లాలోని అన్ని హాస్పిటల్స్‌ను తనిఖీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదే హెల్త్ డిపార్ట్‌మెంట్‌లోని కొందరు సిబ్బందికి వరంగా మారింది. అక్టోబర్ 4 వరకు నిర్వహించిన తనిఖీల్లో యాదాద్రి జిల్లా వ్యాప్తంగా 77 హాస్పిటల్స్‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వగా, మరో 12 హాస్పిటల్స్‌ను సీజ్ చేశారు. తర్వాత హెల్త్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన కొందరు సిబ్బంది వివరణ తీసుకోవాలన్న సాకుతో హాస్పిటళ్ల నిర్వాహకులతో బేరసారాలు సాగిస్తున్నారు. తమకు కావాల్సింది తీసుకుంటూ హాస్పిటల్‌కు తిరిగి పర్మిషన్ ఇప్పించేస్తున్నారు. దీంతో హాస్పిటళ్ల పేర్లు మార్చి మళ్లీ ఓపెన్ చేస్తున్నారు. ఈ విధంగానే తుర్కపల్లి మండలంలోని మాదాపూర్‌కు చెందిన ఓ ఆర్‌ఎంపీ సీజ్ అయిన తన హాస్పిటల్ పేరు మార్చి మళ్లీ ఓపెన్ చేసేందుకు రూ. లక్షలు చేతులు మారినట్లు తెలుస్తోంది.
ఒక్కరోజులోనే ఓపెన్
భువనగిరిలోని ఓ హాస్పిటల్‌లో ఉన్న స్కానింగ్ సెంటర్‌ను గత నెలలో ఆఫీసర్లు సీజ్ చేశారు. తర్వాత ఏమైందో ఏమో గానీ మరుసటి రోజే దానిని ఓపెన్ చేశారు. అలాగే రాజాపేట, ఆలేరు మండలాల్లోని పలువురి ఆర్‌ఎంపీల నుంచి కూడా వసూళ్లు చేస్తున్నట్లు తెలిసింది. పక్క జిల్లా నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన ఓ ఎంప్లాయ్ డీఎంహెచ్‌వో ఆఫీస్‌లో అన్నీ తానై వ్యవహరిస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు సమాచారం.
యాదాద్రి జిల్లా భువనగిరిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో గర్భిణికి అబార్షన్ చేశారని హెల్త్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అం దిం ది. వెంటనే ఓ ఉద్యోగి రంగంలోకి దిగి బేరసారాలు చేశాడు. తనకు కావాల్సిన మొత్తం ఇస్తే హాస్పిటల్‌పై ఎలాంటి చర్య లు తీసుకోబోమంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇంకా చర్చలు నడుస్తున్నాయి.
రాజాపేట మండలంలోని ఇద్దరు ఆర్‌ఎంపీలు ఆపరేషన్లు సహా, అనేక రకాల ట్రీట్ మెంట్లు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న హెల్త్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగి ఒకరు ఆర్‌ఎంపీల వద్దకు వెళ్లి హాస్పిటళ్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. చివరకు తన కు కావాల్సింది అందడంతో హాస్పిటళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వెనుదిరిగాడు.భువనగిరిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో రూల్స్ పాటించడం లేదని గత నెలలో స్కానింగ్ యూనిట్ గదిని సీజ్ చేశారు. మరుసటి రోజే హెల్త్ డిపార్ట్‌మెంట్‌కు చెంది న ఓ వ్యక్తి వచ్చి బేరం మాట్లాడాడు. ఒప్పందం కుదరడంతో సీజ్ అయిన స్కానింగ్ యూని ట్ వెంటనే తెరుచుకుంది.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి
యాదగిరిగుట్ట, వెలుగు : జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి టీయూడబ్ల్యూజే కృషి చేస్తోందని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చెప్పారు. టీయూడబ్ల్యూజే (హెచ్ 143) ఉమ్మడి నల్గొండ జిల్లా మహాసభలను సోమవారం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్లం నారాయణతో పాటు, మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.వంద కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు వచ్చేలా టీయూడబ్ల్యూజే కృషి చేస్తోందని చెప్పారు. విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాధనలో జర్నలిస్టుల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. సోషల్ మీడియా ప్రభావం వల్ల అసలైన జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం మంజూరు చేసే పథకాలు జర్నలిస్టులకు అందకుండా ఆటంకాలు ఎదురవుతున్నాయన్నారు. సోషల్ మీడియా కారణంగా జర్నలిస్టుల సంఖ్య విపరీతంగా పెరగడంతో ఇండ్ల స్థలాల పంపిణీలో ఆలస్యం జరుగుతోందన్నారు. అనంతరం నల్గొండ, సూర్యాపేట జిల్లా కమిటీలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్, తెమ్జూ రాష్ట్ర అధ్యక్షుడు ఇస్మాయిల్, టీయూడబ్ల్యూజే యాదాద్రి జిల్లా అధ్యక్షుడు గొట్టిపర్తి భాస్కర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి జూకంటి అనిల్, మహాసభల ఆహ్వాన కమిటీ సభ్యుడు గుండ్లపల్లి శ్రీరాంగౌడ్, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్‌పర్సన్ ఎరుకల సుధ పాల్గొన్నారు.
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
హాలియా, వెలుగు : గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని నల్గొండ డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్ విమర్శించారు. నల్గొండ జిల్లా హాలియాలో రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గిరిజన సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని సూచించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం గిరిజనులకు 25 రకాల హామీలు ఇచ్చిందని, వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. గిరిజనులకు మూడు ఎకరాల భూమి ఇవ్వడంతో పాటు గిరిజనబంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం గిరిజన ప్రజాసమాఖ్య ఆధ్వర్యంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నేనావత్ బాలునాయక్, డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్, త్రిపురారం జడ్పీటీసీ భారతి భాస్కర్‌నాయక్, ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు సపావత్ పాండునాయక్‌ను సన్మానించారు. గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రమావత్ దినేశ్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి శేఖర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ నాగేందర్‌నాయక్, జిల్లా అధ్యక్షుడు రమావత్ సర్దార్ నాయక్, కృష్ణానాయక్
పాల్గొన్నారు.
ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలి
దేవరకొండ/కోదాడ/తుంగతుర్తి/హుజూర్‌నగర్, వెలుగు : సీపీఐ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా దేవరకొండ, సూర్యాపేట జిల్లా కోదాడ, తిరుమలగిరిలో ఆ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ భూస్వాములు, పెట్టుబడి దారులకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కమ్యూనిస్టులకు ఉందన్నారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే పేదలకు దక్కాల్సిన పథకాలు అందకుండా పోతున్నాయన్నారు. అనంతరం అమరవీరులకు నివాళి అర్పించారు. దేవరకొండలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నర్సింహారెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి, కోదాడలో పైడిమర్రి వెంకటనారాయణ, మేకల శ్రీనివాసరావు, ఉస్తేల సృజన, తిరుమలగిరిలో నియోజకవర్గ ఇన్‌చార్జి ఎల్లంల యాదగిరి, సీపీఐ మండల కార్యదర్శి వాసిరెడ్డి సోమిరెడ్డి, ఇక్బాల్, ఎర్రగట్టు రాజా, కనుక అశోక్, హుజూర్‌నగర్‌లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్, నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు, యల్లావుల రాములు, దొడ్డ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలను భాగస్వాములను చేయాలి
మునగాల, వెలుగు : పోలీస్ సేవలను వేగంగా అందించేందుకు ప్రజలను భాగస్వాములను చేయాలని సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ సూచించారు. మునగాల పీఎస్‌ను సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసు విధులు, ఫంక్షనల్ వర్టికల్స్ విభాగాలు సమర్థవంతంగా నిర్వహించడం వల్ల వల్ల పోలీస్ సేవలు వేగంగా అందుతాయన్నారు. ఫిర్యాదులపై వేగంగా స్పందించి ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలను తరచూ సందర్శిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కోదాడ సబ్ డివిజనల్ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస్, మునగాల సీఐ ఆంజనేయులు, ఎస్సై లోకేశ్ ఉన్నారు.
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సోమవారం ఎస్పీ రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో 23 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రూరల్ సీఐ సోమనారాయణసింగ్, ఎస్సైలు విష్ణు, మధు, సాయిరాం పాల్గొన్నారు.