- సీఎం రేవంత్‌రెడ్డికి చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేల వినతి
కోల్‌బెల్ట్, వెలుగు: యాదవుల సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డిని చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు గడ్డం వివేక్‌వెంకటస్వామి, వినోద్ కోరారు. ఈ మేరకు బుధవారం అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్ బండి సదానందం, పలువురు యాదవులతో అసెంబ్లీ చాంబర్లో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. యాదవుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కారమయ్యేలా కృషి చేస్తామని చెప్పారు. బండి సదానందం యాదవ్ మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లాలో రెండో విడత గొర్రెల యూనిట్ల కోసం 7,833 మంది డీడీలు కడితే అప్పటి బీఆర్ఎస్ సర్కార్ కేవలం 700 యూనిట్లు మాత్రమే కేటాయించిందన్నారు.
మిగిలిన వారికి ఇవ్వకుండా మోసం చేసిందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్పారు. తమ డబ్బులు వాడుకొని అసలు, వడ్డీ ఇవ్వడంలోనూ జాప్యం చేసిందన్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాతే తాము కట్టిన డబ్బులు వచ్చాయన్నారు. మూడేండ్లు ఉచితంగా పంపిణీ చేయాల్సిన నట్టల నివారణ మందు కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల మేనిఫెస్టోలో గొర్రెల యూనిట్‌ను రూ.2 లక్షలుగా ప్రకటించిందని, స్కీమ్ అమలులో గతంలో డీడీలు కట్టిన వారికి ప్రయారిటీ ఇవ్వాలని కోరారు. జిల్లాల వారీగా యాదవ సొసైటీ ఎన్నికలను నిర్వహించి, సొసైటీ జిల్లా చైర్మన్లను నియమించాలన్నారు. మంచిర్యాలలో యాదవ సంక్షేమ భవనం మంజూరు చేసి స్థలం, ఫండ్స్ కేటాయించాలని కోరారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యాదవులకు గొర్రెల యూనిట్ స్కీమ్‌ను వర్తింపజేయాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని యాదవులు గొంగడి కప్పి సన్మానించారు. సీఎంను కలిసిన వారిలో సంఘం జనరల్ సెక్రటరీ మల్లెత్తుల నరేష్ యాదవ్, రాష్ట్ర యూత్ వైస్ ప్రెసిడెంట్ బండి శివ కుమార్‌యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎరవేని కిట్టన్న యాదవ్, దండేపల్లి మండల అధ్యక్షుడు అల్లంలా సత్తయ్య యాదవ్, అల్లంల మల్లేష్ యాదవ్, మాచర్ల గోపి యాదవ్ తదితరులు ఉన్నారు.