- ప్రజల నుంచి పెరుగుతున్న ఒత్తిడి
- బై పోల్ వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకం
- మునుగోడు బై పోల్ హడావుడితో అన్ని చోట్ల డిమాండ్లు
- పేరుకుపోయిన సమస్యలు ప్రస్తావిస్తూ నిలదీస్తున్న జనం
- ఏం చెప్పాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్న ఎమ్మెల్యేలు
వెలుగు, నెట్వర్క్: తమ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకం ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో కనిపిస్తున్నది. నేరుగా ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి.. రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు రాజీనామా చేయాలో వివరిస్తున్నారు. నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యలను ఏకరువు పెడ్తున్నారు. అవి పరిష్కారం కావాలన్నా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ రావాలన్నా స్థానిక ఎమ్మెల్యే రిజైన్ చేసి ఉప ఎన్నికకు పోతేనే సాధ్యమవుతుందని చెప్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హడావుడిని చూసి పబ్లిక్ నుంచి ఇలాంటి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. నాలుగైదు రోజుల్లో ఏకంగా ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఓటర్లు, కార్యకర్తల నుంచి ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చాయి. బైపోల్ ప్రచారంలో భాగంగా నెలరోజులుగా మునుగోడులోనే మకాం వేసిన ఎమ్మెల్యేలు.. ఈ ఫోన్ కాల్స్‌తో తలలు పట్టుకుంటున్నారు. అన్నోన్ నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను ఎత్తేందుకు జంకుతున్నారు. ‘‘సార్.. ఇప్పుడు ఉప ఎన్నిక వల్ల మీ కండ్ల ముందే మునుగోడుకు అన్నీ వస్తున్నయ్. అందరూ లీడర్లు వస్తున్నరు. మీరు కూడా రాజీనామా చేస్తే మన నియోజకవర్గం డెవలప్ అయితది” అని ఓటర్లు ఫోన్లలో పట్టుబడుతున్నారు.
మునుగోడులో ఎవరు గెలుస్తరుంటూనే..!
అక్టోబర్ 29న మెదక్ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి రామాయంపేటకు చెందిన ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. మొదట ‘‘అక్కా.. మునుగోడులో ఏ పార్టీ గెలుస్తది’’ అని అడిగి, తర్వాత తన మనసులోని మాట బయటపెట్టాడు. ‘‘మీరు కూడా రాజీనామా చేస్తే మనకూ ఉప ఎన్నిక వస్తది.. మా కాట్రియాల విలేజ్ కూడా డెవలప్ అయితది కదా అక్కా’’ అనడంతోనే ఎమ్మెల్యే ఫోన్ కట్‌చేశారు. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వరుసగా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కు ఆయా నియోజకవర్గాల్లోని పబ్లిక్ నుంచి ఇలాంటి ఫోన్‌కాల్సే వచ్చాయి. ముందుగా మునుగోడు గురించి ఆరా తీసిన కాలర్స్.. ఆ తర్వాత మెల్లగా టాపిక్ మార్చి, ‘‘మీరు కూడా రాజీనామా చేస్తే మనకూ బై ఎలక్షన్ వచ్చి, ప్రభుత్వం నుంచి ఫండ్స్వస్తయ్.. ఆ పైసలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసుకోవచ్చు” అని సూచించారు. కొందరైతే తమ గ్రామంలో సమస్యలు పరిష్కారం కావాలంటే ఎమ్మెల్యే రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్‌చేశారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు కాస్తా డిఫరెంట్‌గా స్పందించారు. ఆయనకు ఫోన్ చేసిన వ్యక్తి ఎమ్మెల్యేను రాజీనామా చేయమని కోరగా.. సీఎం కేసీఆర్ ను అడిగి అలాగే చేస్తానని అన్నారు. మిగిలినవారంతా మొహం మీదే ఫోన్ కట్‌చేయడంతో పాటు అసహనానికి గురయ్యారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేల అనుచరులైతే ఫోన్ చేసినవాళ్లకు కాల్ చేసి బెదిరించడమేగాక, తిట్ల దండకం అందుకున్నారు.
ఎందుకు రిజైన్ చెయ్యుమంటున్నారంటే..
రాష్ట్రం చాలా నియోజకవర్గాల్లో సమస్యలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్లో కురిసిన వర్షాలకు రోడ్లన్నీ డ్యామేజ్ అయ్యాయి. బిల్లులు పెండింగ్పెట్టడంతో టెండర్లు పిలిచినా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వస్తలేరు. దీంతో గుంతల రోడ్లపై ప్రయాణం చేసేందుకు జనం నరకం చూస్తున్నారు. డ్రైనేజీలు దెబ్బతిని మురుగునీళ్లు రోడ్లపై పారుతున్నా వాటి దిక్కు చూసినవాళ్లు లేరు. పంచాయతీ ఆఫీసులు మొదలుకొని సర్కారు స్కూళ్లు, అంగన్వాడీ, హెల్త్ సబ్ సెంటర్లు.. చాలావరకు శిథిలావస్థకు చేరినా పట్టించుకునే దిక్కులేదు. నాలుగేండ్లుగా ఇదే పరిస్థితి. కానీ ఎక్కడ ఉప ఎన్నిక జరిగితే అక్కడ గెలిచేందుకు స్వయంగా సీఎం కేసీఆర్ వచ్చి, స్పెషల్గ్రాంట్స్ పేరుతో గ్రామాలు, పట్టణాలకు వందల కోట్ల ఫండ్స్శాంక్షన్ చేస్తున్నారు. ఈ నిధులతో ఆయా గ్రామాలు, పట్టణాల్లో రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్లు, పంచాయతీ భవనాలు నిర్మించుకుంటున్నారు. ఇవి కాకుండా డబుల్బెడ్రూం ఇండ్లను స్పీడప్ చేయడంతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు స్వయంగా ఇండ్లకు వచ్చి కొత్త పింఛన్లు, కొత్త రేషన్‌కార్డులు, కల్యాణలక్ష్మి, సీఎంరిలీఫ్ఫండ్లాంటివి అందజేస్తున్నారు. దీంతో ప్రతిపక్షాలు కూడా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో తప్ప ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని కొంతకాలంగా ఆరోపిస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్యేలకు వస్తున్న ఫోన్ కాల్స్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కావడంతో నాలుగేండ్లుగా మునుగోడు నియోజకవర్గంవైపు కన్నెత్తి చూడని టీఆర్ఎస్ సర్కారు.. ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన వెంటనే రంగంలోకి దిగిందని జనం అంటున్నారు. ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో నియోజకవర్గంలో పెండింగ్పనులపై దృష్టిపెట్టిందని, అలా సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే తమ ఎమ్మెల్యే రాజీనామా చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు.
హుజూరాబాద్, దుబ్బాకలోనూ ఇదే సీన్..
ఈటల రాజేందర్ రాజీనామాతో గతేడాది అక్టోబర్‌లో హుజూరాబాద్ కు ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికలో ఎలాగైనా గెలవాలని భావించిన సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి ఏకంగా రూ. 4,200కోట్ల ఫండ్స్ విడుదల చేయించారు. నియోజకవర్గంలోని 45 వేల ఎస్సీ ఓటర్లను దృష్టిలో పెట్టుకొని దళిత బంధు స్కీం తెచ్చారు. 23 వేల మంది ఖాతాల్లో రూ. 10 లక్షల చొప్పున జమ చేశారు. సుమారు 10 వేల మందికి కొత్త పింఛన్లు మంజూరు చేశారు. ఐకేపీ మహిళలకు పెండింగ్పడ్డ రూ.120 కోట్లను జమచేశారు. ఊరూరా రోడ్లు, డ్రైనేజీలు, జంక్షన్ల అభివృద్ధి చేపట్టారు. రూ.80 కోట్లతో గొల్లకురుమలకు పెండింగ్ లో ఉన్న 2,874 యూనిట్లు పంపిణీ చేశారు. ఇంకా కుల సంఘాలను ఆకట్టుకునేందుకు స్థలాలు, కమ్యూనిటీ భవనాలు మంజూరు చేశారు. కేవలం ఆత్మగౌరవ భవనాల కోసం రూ.20 కోట్లు ఇచ్చారు. అంతకుముందు జరిగిన నాగార్జునసాగర్, దుబ్బాక ఉప ఎన్నికల టైంలోనూ రాష్ట్రప్రభుత్వం సీడీఎఫ్ కింద వందల కోట్లు రిలీజ్చేశారు. దుబ్బాక నియోజకర్గంలో కొత్తగా 3,500 మందికి పింఛన్లు, దుబ్బాక మున్సిపాల్టీకి రూ.20కోట్లు, కమ్యూనిటీ భవనాల కోసం రూ.20కోట్లు, గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణాని దాదాపు రూ.50 కోట్లు ఇచ్చారు. ఇలా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాలకే వందల కోట్ల ఫండ్స్ ఇవ్వడం, అక్కడే అభివృద్ధి పనులు జరుగుతుండడం, వెల్ఫేర్ స్కీమ్స్కూడా అక్కడి పబ్లిక్కే అందుతుండడం, ఇక ఎన్నికలు జరిగినన్ని రోజులు తాగినోళ్లకు తాగినంత మందు, విందులతోపాటు ఓటర్లకు ఎక్కడా లేనంత విలువను లీడర్లు ఇస్తుండడంతో మిగిలిన నియోజకవర్గాల్లోని పబ్లిక్ కూడా తమ ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని, తమకూ ఉప ఎన్నిక రావాలని కోరుకుంటున్నారు.
రాస్తారోకో చేపట్టి మరీ..!
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలానికి చెందిన ఆరు గ్రామాల ప్రజలు రాస్తారోకో చేస్తూ తమ డిమాండ్ వినిపించారు. జందాపూర్ నుంచి కరంజీ మధ్య 33 కిలోమీటర్ల రోడ్డు గుంతలతో ప్రమాదకరంగా మారినా పట్టించుకోవడం లేదంటూ ఆదివారం నిపాని గ్రామం వద్ద మూడుగంటలపాటు రాస్తారోకో చేశారు. తమ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు రాజీనామా చేస్తే తప్ప ప్రభుత్వం రోడ్డు వేసేలా లేదని, ఆయన వెంటనే పదవికి రాజీనామా చేసి, రోడ్డు వేసేలా చూడాలని వారు డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యేలకు ఫోన్లలో డిమాండ్లు ఇట్లా..!
‘‘అన్న నమస్తే.. మునుగోడులో ఎట్లుందన్న. మన దగ్గర కూడా ఉప ఎన్నిక వస్తే మునుగోడు లెక్క డెవలప్ అయితది కదా అన్న’’
- జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డితో ఓ ఓటరు
‘‘మేడమ్.. మీరు కూడా రాజీనామా చేస్తే మా విలేజ్‌కి జర్ర హెల్ప్ చేసినట్లయితరు’’
- మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో ఓ గ్రామస్తుడు
‘‘బాగున్నర సార్..! మాకు రోడ్లు లేవు, జాబ్స్లేవు, నిరుద్యోగ భృతి ఇస్తలేరు, కేజీ టు పీజీ ఫ్రీ విద్య అమలైతలేదు, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తలేరు.. ఇట్ల మస్తు సమస్యలున్నయ్ సార్. మీరు రిజైన్ చేసి బై పోల్‌కు పోతే సమస్యలు పరిష్కారమైతయ్’’
- హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌తో ఓ గ్రామస్తుడు
‘‘ఒక్కమాట సార్.. మీరు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేస్తే మా అందరికీ ఫాయిదా ఉంటది’’
- జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావుతో ఓ గ్రామ వార్డు మెంబర్
‘‘సార్.. మీరు గిట్ల రాజీనామా చేస్తే.. నర్సాపూర్ అభివృద్ధి అయితది. మిమ్మల్ని మళ్లా గెల్పించుకుంటం’’
- నర్సాపూర్ ఎమ్మెల్యే
మదన్‌రెడ్డితో ఓ కార్యకర్త