ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన్రు.. అసెంబ్లీకి హాజరైన మహా వికాస్ అఘాడి సభ్యులు

ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన్రు.. అసెంబ్లీకి హాజరైన మహా వికాస్ అఘాడి సభ్యులు
  • నేటితో ముగియనున్న సెషన్

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో 105 మంది సభ్యులు ఎమ్మెల్యేలుగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మూడు రోజుల సెషన్​లో భాగంగా మొదటి రోజైన శనివారం 173 మంది ఎమ్మెల్యేలు, ఆదివారం 105 మంది ప్రమాణం చేశారు. ఈవీఎంల పనితీరుపై తమకు అనుమానాలు ఉన్నాయంటూ మహా వికాస్ అఘాడి ఎమ్మెల్యేలు తొలిరోజు సెషన్​ను బాయ్​కాట్ చేశారు. తాజాగా కాంగ్రెస్ నేతలు నానా పటోలే, విజయ్ వడేట్టివార్, అమిత్ దేశ్​ముఖ్, ఎన్సీపీ (ఎస్పీ) లీడర్ జితేంద్ర అవ్హాద్, శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు.

 గైర్హాజరైన 9 మంది సభ్యులు సోమవారం ప్రమాణం స్వీకారం చేయనున్నారు. కాగా, బీజేపీ సీనియర్ నేత రాహుల్ నర్వేకర్ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్​గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహా వికాస్ అఘాడి నుంచి ఎవరూ స్పీకర్ పోస్టు కోసం నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో రాహుల్ ఎన్నిక ఏకగ్రీవమైంది. కాగా, శివసేన (షిండే) నుంచి 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఈమేరకు జాబితా సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వీరిలో ఆరుగురు మాజీ 
మంత్రులు కాగా మిగతా ఐదుగురు కొత్తవాళ్లు.

సీఎం ప్రమాణ స్వీకార సభలో దొంగల చేతివాటం

ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో జేబు దొంగలు చేతివాటం ప్రదర్శించారు. గోల్డ్ చైన్​లు, సెల్​ఫోన్లు, నగదు.. ఇలా మొత్తం రూ.12 లక్షలు విలువ చేసే వస్తువులు చోరీకి గురయ్యాయి. ఈ ప్రోగ్రామ్ కోసం ఏకంగా 4 వేల మంది పోలీసులను మోహరించినప్పటికీ ఈ స్థాయిలో దొంగతనాలు జరగడం గమనార్హం.