చరిత్ర మరువకూడదు.. ఇండియా, పాకిస్తాన్ వేరు వేరు కాదు: షాదాబ్ ఖాన్

చరిత్ర మరువకూడదు.. ఇండియా,  పాకిస్తాన్ వేరు వేరు కాదు: షాదాబ్ ఖాన్

దేశ విభజన జరగక ముందు ఇండియా, పాకిస్తాన్ ఉమ్మడిగా ఉండేవన్న సంగతి అందరికీ విదితమే. 300 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించిన ఆంగ్లేయులు.. పోతూ పోతూ అఖండ భారతాన్ని రెండుగా చీల్చి పోయారు. ఒక్క దేశాన్ని రెండుగా చీలుస్తూ ఓ గీతను గీశారు. దీంతో పాకిస్తాన్‌ అనే కొత్త దేశం పురుడు పోసుకుంది. ఆ నిర్ణయంతో కొన్నేళ్ల తరబడి ఇక్కడ సోదరభావంతో మెలిగిన ప్రజలు బలవంతంగా గ్రామాలను దాటారు. ఇలా చెప్పుకుంటూ పోతే గతాన్ని మాటల్లో వర్ణించలేం. ఆ జ్ఞాపకాలను పాకిస్తాన్ క్రికెటర్ షాదాబ్ ఖాన్ మరోసారి అందరికీ గుర్తు చేశారు.

అగ్రరాజ్యం అమెరికా వేదికగా ప్రారంభమైన మేజర్ లీగ్ క్రికెట్(ఎంఎల్  సీ) భారత్- పాక్ ఆటగాళ్ల మధ్య మంచి వాతావరణాన్ని కల్పిస్తోంది. ఇరు దేశాల ఆటగాళ్లు కలిసి ఆడుతూ.. ఒకరికొకరు సోదరభావంతో మెలుగుతున్నారు. ఈ క్రమంలో భారత క్రికెటర్లు తజిందర్ సింగ్, చైతన్య భిష్ణోయ్‌‌లతో కలిసి శాన్ ఫ్రాన్సికో యూనికార్న్స్‌ జట్టుకు ఆడుతున్న షాదాబ్ ఖాన్.. భారత ప్లేయర్ల గురించి, ఇండియా దేశం గురుంచి సంచలన వ్యాఖ్యలు చేశారు.

విభజనకు ముందు ఇరు దేశాల ఆటగాళ్లు ఉమ్మడిగా మైదానాన్ని పంచుకున్న విషయాన్ని గుర్తుచేసుకున్న షాదాబ్.. భారత క్రికెటర్లతో కలిసి ఆడుతుండటం తనలో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని వెల్లడించారు.

"1947కి ముందు భారత్, పాకిస్తాన్ అంటూ రెండు దేశాలు లేవు. మనమంతా ఒక్కటే. కలిసి ఆడాం. ఆరోజులు మరోసారి మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీ రూపంలో మనముందుకు వచ్చాయి. భారత సోదరులతో కలిసి ఆడుతుండటం చాలా సంతోషంగా ఉంది. ఇరు జట్ల మధ్య ఉన్న సమస్యలను తొలగించుకోవడానికి ఇదే అద్భుతమైన అవకాశం. మన భాషలు, సంస్కృతి ఒక్కటే. పంజాబీలో మాట్లాడుతుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. కలిసి ఉంటుంటే అన్నదమ్ములతో ఉన్నట్టే ఉంటుంది.." అని షాదాబ్ తన మనసులోని మాటను బయటకి వెల్లడించారు. షాదాబ్ ఖాన్ మాటలపై ఇరుదేశాల క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

'When there was no India and no Pakistan (before 1947) we used to play together and that's happening in the #MajorLeagueCricket once again' - Shadab Khan

What a gem of a person Shadab is ♥️ #MLC2023 pic.twitter.com/gdm3CoPvfH

— Farid Khan (@_FaridKhan) July 14, 2023