అమెరికా గడ్డపై పరువు తీశారు: 50 పరుగులకే ఆలౌట్

అమెరికా గడ్డపై పరువు తీశారు: 50 పరుగులకే ఆలౌట్

మేజర్ లీగ్ క్రికెట్(ఎంఎల్‌సీ) 2023 టోర్నీలో కేకేఆర్‌ ప్రాంచైజీ లాస్ ఏంజిల్స్ నైట్‌రైడర్స్‌ ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోతోంది. వరుసగా రెండో మ్యాచులోనూ ఓడింది. ఆదివారం ముంబై ఇండియన్స్‌ జట్టు ఎంఐ న్యూయార్క్‌తో జరిగిన మ్యాచులో 50 పరుగులకే కుప్పకూలిన నైట్‌రైడర్స్‌.. 105 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది.

జట్టులో ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, మార్టిన్ గప్టిల్, రిలీ రోసౌ వంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నా.. లాస్ ఏంజిల్స్ జట్టు కనీస పోటీ ఇవ్వకపోవటం గమనార్హం.  టీ20 లీగ్ చరిత్రలోనే కేకేఆర్ ఫ్రాంచైజీకి ఇది ఘోర పరాజయం. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్(48 నాటౌట్) పరుగులతో రాణించగా.. నికోలస్ పూరన్(38) పర్వాలేదనిపించాడు. లాస్ ఏంజిల్స్ బౌలర్లలో అలిఖాన్, ఆడమ్ జంపా, కోర్న్ డ్రై రెండేసి వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసన్ ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం 156 పరుగుల లక్ష్యచేధనకు దిగిన నైట్‌రైడర్స్ 13.5 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. ఉన్ముక్త్ చంద్(26) ఒక్కడే రెండెంకెల స్కోర్ చేయగా.. మిగిలిన బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మార్టిన్ గప్టిల్(0), నితీశ్ కుమార్(0), కార్న్ డై(0), లాకీ ఫెర్గూసన్(0)‌లతో మొత్తం నలుగురు బ్యాటర్లు డకౌట్ కావడం గమనార్హం. ఆండ్రీ రస్సెల్(2) చేసిన కీరన్ పోలార్డ్ యూనిక్ సెలెబ్రేషన్స్ ఎంజాయ్ చేశాడు. ఎంఐ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, రబడా, ఎహ్‌సన్ ఆదిల్, కీరన్ పోలార్డ్, నస్తూష్ కెనిజే తలో రెండు వికెట్లు తీసుకున్నారు.

ఐపీఎల్‌లో నిలకడగా రాణించే కేకేఆర్ జట్టు 50 పరుగులకు ఆలౌటవ్వడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ గడ్డపై ఆ ఫ్రాంచైజీకి ఉన్న ప్రతిష్టను దిగజార్చుతున్నారని మండిపడుతున్నారు.