
- అధికారిక కార్యక్రమాలకు కలిసి వెళ్లొద్దా: ఎమ్మెల్సీ అద్దంకి
- రోడ్డు మార్గంలో కంటే హెలికాప్టర్లో వెళ్తేనే ఖర్చు తక్కువ
- విహారయాత్రలకు వెళ్తున్నారనడం సరికాదని ఫైర్
హైదరాబాద్, వెలుగు: అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రులు హెలికాప్టర్లో వెళ్తే బీఆర్ఎస్ లీడర్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. విహారయాత్రలకు వెళ్తున్నారంటూ కామెంట్లు చేయడంపై ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ను చూసి వచ్చేందుకు గత బీఆర్ఎస్ సర్కార్ ఓ ఐఏఎస్ అధికారిణికి ఏకంగా హెలికాప్టర్ ఇచ్చి పంపిందని గుర్తు చేశారు. మంగళవారం అద్దంకి మీడియాతో మాట్లాడారు. ‘‘ఒకే రోజు మూడు, నాలుగు చోట్ల అధికారిక ప్రోగ్రామ్ లు ఉండడంతో ముగ్గురు మంత్రులు కలిసి హెలికాప్టర్లో వెళ్తే తప్పేంటి? బీఆర్ఎస్ హయాంలో ఏకంగా ఒక ఐఏఎస్ అధికారిణికి హెలికాప్టర్ ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు చూసి రమ్మని పంపిన్రు.
నిత్యం ప్రజా సేవలో ఉండే మంత్రులు.. హెలికాప్టర్లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటే విమర్శించడం ఏంటి? ఒక ఐఏఎస్ అధికారిణికి ప్రత్యేక హెలికాప్టర్ ఉపయోగించే అధికారం ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇచ్చిందా? అలాంటి సందర్భాలు ఉన్నాయా? ముగ్గురు మంత్రులు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే అయ్యే ఖర్చు కన్నా.. హెలికాప్టర్లో ప్రయాణిస్తే అయ్యే ఖర్చు చాలా తక్కువనే విషయం బీఆర్ఎస్ నేతలు తెలుసుకోవాలి. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ మాత్రమే ప్రభుత్వ హెలికాప్టర్లో తిరిగేవాళ్లు. వారి పాలనలో ఇతర మంత్రులు ఎవరైనా ప్రభుత్వ హెలికాప్టర్ ను వాడారా? అంత సాహసం చేశారా?’’అని అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో మాత్రం టైమ్ లేకపోవడంతో సీఎం, మంత్రులు కూడా ప్రజా పాలనను పల్లెలకు సైతం చేరువ చేసేందుకు హెలికాప్టర్ ను వినియోగిస్తున్నారని తెలిపారు. ఈ విషయం బీఆర్ఎస్ నేతలు తెలుసుకోవాలని సూచించారు.