హైదరాబాద్, వెలుగు: ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యమ్రాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచడం కోసం గురువారం నుంచి ఈ నెల 19 వరకు ఈ ప్రోగ్రామ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బుధవారం దోమల్‌గూడ యూటీఎఫ్ భవన్‌లో జరిగిన టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశానికి నర్సిరెడ్డి హాజరై, మాట్లాడారు.
విద్యార్థుల నమోదుతో పాటు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడం కోసం ప్రభుత్వం, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు సమన్వయంతో ముందుకు రావాలని కోరారు. విద్యను బలోపేతం చేయడం ద్వారా పేద బడుగు, బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తుకు ఊతమిచ్చిన వారమవుతామన్నారు. యూటీఎఫ్ ప్రెసిడెంట్ జంగయ్య మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు పదోన్నతులు లేక తొమ్మిదేళ్లుగా ఆందోళనకు గురవుతున్నారని, ఆరేళ్లుగా బదిలీలు జరగకపోవడంతో విద్యారంగానికి తీవ్ర నష్టం కలిగిందన్నారు.
వెంటనే బదిలీలు, ప్రమోషన్ షెడ్యూల్ ప్రకటించాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఏళ్ల తరబడి పెట్టిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని పేర్కొన్నారు.