
- మెదక్ కలెక్టరేట్ వద్ద బీజేపీ రైతు సత్యాగ్రహ దీక్షకు మద్దతు
మెదక్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మెదక్ కలెక్టరేట్ వద్ద బీజేపీ కిసాన్ సెల్ ఆద్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరై మాట్లాడారు.
రూ 20,650 కోట్లు మాత్రమే రైతు రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. రైతు భరోసా ఇవ్వడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పాలనలో ఇప్పటి వరకు 355 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. రైతులకు న్యాయం జరిగేవరకు వారి పక్షాన బీజేపీ పోరాటం చేస్తుందని వెల్లడించారు.
ప్రభుత్వం కరెంట్ సరిగ్గా ఇవ్వకపోవడంతో పంటలు ఎండుతున్నాయని, దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరారు. నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీలను ఓపెన్ చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్ గౌడ్, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి, పార్టీ నాయకులు విజయ్, మధు, ప్రసాద్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.