మూసీ వద్ద బీజేపీ మూడు నెలలు ఉండాలి : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

హైదరాబాద్, వెలుగు: మూసీ వాసుల అవస్థలు తెలియాలంటే మూడు నెలలు బీజేపీ కార్యకలాపాలు అక్కడే కొనసాగించాలని సీఎం సవాల్ విసిరారని, కానీ బీజేపీ మూసీ నిద్ర పేరుతో ఈవెంట్ చేసిందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఎద్దేవా చేశారు. మూసీ ప్రక్షాళన రాజకీయ కోణంలో చూడొద్దని, భవిష్యత్ తరాల బాగు కోసం మద్దతు ఇవ్వాలని ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. 

బీజేపీ మూసీ నిద్ర కంటే ముందే శానిటేషన్ సిబ్బందితో పరిసరాలు శుభ్రం చేయించిందని, దోమలు ఎక్కడ కుడతాయోనన్న భయంతో కిషన్ రెడ్డి సాక్సులు విప్పకుండా జాగ్రత్తపడ్డారని విమర్శించారు. కిషన్ రెడ్డి అనేక సందర్భాల్లో మూసీ పునరుజ్జీవంపై మాట్లాడారని, ఇప్పుడు ఆయనే మూసీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డి మొదటి ప్రయారిటీ అభివృద్ధి అని, దీనికి ఎవరు అడ్డొచ్చినా బుల్డోజర్ ఎక్కిస్తామన్నారని హెచ్చరించారు.