హరీష్ రావు కొంచెమన్నా సిగ్గుండాలి.. ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఫైర్

హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫైర్ అయ్యారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడేందుకు హరీష్ రావుకు కొంచెమన్నా సిగ్గుండాలని విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు  మీరు చేసిన పార్టీ ఫిరాయింపులు, విలీనాలు మర్చిపోయారా అని నిలదీశారు. హరీష్ రావు గతంలో చేస్తున్న దానికి ఇప్పుడు చేస్తున్నాదానికి ఏమైనా పొంతన ఉందా..? అని ప్రశ్నించారు. 

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఏడుగురు శాసన సభ్యులను అనర్హులుగా ప్రకటించాలని హరీష్ రావు అంటున్నారు.. మరీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు ఆయన ఎందుకు మాట్లాడలేదని సూటిగా ప్రశ్నించారు. మీ ప్రభుత్వ హయంలో ప్రతిపక్షం లేకుండా చేసి మీ పార్టీలో విలీనం చేసుకుని.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత  పిటిషన్ దాఖలు చేయడంపై మండిపడ్డారు. 

ALSO READ | అన్ని విషయాల్లో నైపుణ్యం ఉన్న లీడర్ జైపాల్ రెడ్డి: ఎమ్మెల్యే వివేక్

కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకుని ఆరోజు ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేసింది మీరు కాదా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తోన్న సంక్షమే పథకాలను తెలంగాణ ప్రజలు హర్షిస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నారని బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పరిపాలనను మీరు.. మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే.. ప్రజా ప్రభుత్వాన్ని బలపరచాలని మీ పార్టీ ఎమ్మెల్యేలు మా కాంగ్రెస్‎లో చేరుతున్నారని అన్నారు.