అనుములకి, ఎనుములకి తేడా తెల్వదా : బల్మూరి వెంకట్‌

అనుములకి, ఎనుములకి తేడా తెల్వదా :  బల్మూరి వెంకట్‌

హైదరాబాద్, వెలుగు:  చిత్రపురి సొసైటీలో జరిగిన అక్రమాలకు సీఎం రేవంత్‌ రెడ్డికి ఏం సంబంధమని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రశ్నించారు. అనుములకి, ఎనుములకి తేడా తెలియకుండా విమర్శలు చేస్తున్నారని, సీఎం ఇంటి పేరు తెలియకుండా బీఆర్‌‌ఎస్ సోషల్ మీడియా ఆయనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం గాంధీ భవన్‌లో కార్పొరేషన్ చైర్మన్లు ప్రీతమ్, మెట్టుసాయి, అధికార ప్రతినిధి లింగం యాదవ్, యూత్ కాంగ్రెస్ నేత రాజీవ్ రెడ్డిలతో కలిసి మీడియాతో బల్మూరి మాట్లాడారు.

రేవంత్ రెడ్డికి మహేందర్ రెడ్డి అనే సోదరుడు లేరని, చిత్రపురి అక్రమాలపై నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రభుత్వానికి ఇవ్వాలని, తప్పకుండా వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిని తమ ప్రభుత్వం వదిలిపెట్టదని, అనవసరంగా ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. చిత్రపురిలో గత ప్రభుత్వ హయాంలోనే అక్రమాలు జరిగాయని, అప్పటి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.

గతంలో హుజూరాబాద్‌లో తన ఫోన్‌ను స్వాధీనం చేసుకొని కేసు పెట్టారని, ఈ విషయం క్రిశాంక్‌ మర్చిపోయాడన్నారు. క్రిశాంక్ తప్పుడు పోస్ట్ పెట్టడంతో పోలీసులకు ఫిర్యాదు అందిందని, ఆ తర్వాతే పోలీసులు అతనిపై కేసు పెట్టి ఫోన్ సీజ్‌ చేశారని తెలిపారు.