- హస్తం గూటికి ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్, బస్వరాజు సారయ్య!
- ఇటీవల సీఎం వరంగల్ టూర్‍లో వేం నరేందర్‍తో ఇరువురు ఎమ్మెల్సీల మంతనాలు
- అప్పటి నుంచే వీరిద్దరూ కారు దిగుతారనే టాక్
వరంగల్, వెలుగు: ఎమ్మెల్సీ, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్ సీఎం రేవంత్‍రెడ్డిని కలవడంతో ఆయన కాంగ్రెస్‍లో చేరుతారంటూ కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఊతమిచ్చినట్లయింది. ఇటీవల సీఎం వరంగల్ టూర్‍లో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‍తో బండా ప్రకాశ్‌తోపాటు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మంతనాలు జరిపారు. వీరిలోబండా ప్రకాశ్సీఎంను కలవడంతో ఆయనతో పాటు బస్వరాజుకూడా కారు దిగుతారననే టాక్ వినిపిస్తోంది. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన బండా ప్రకాశ్ కాంగ్రెస్‍లో చాలా సీనియర్ లీడర్‍గా ఉన్నారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్‍కు మద్దతుగా నిలిచి బీఆర్ఎస్లో చేరారు. అప్పటికే ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన ఈటల రాజేందర్ ను పార్టీ నుంచి బయటకు పంపించడంతో ఆ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో రాజేందర్ స్థానంలో ప్రకాశ్‍కు కేసీఆర్ప్రాధాన్యత ఇచ్చారు. అప్పటివరకు ఎమ్మెల్సీగా ఉన్న ప్రకాశ్‍కు రాజ్యసభకు పంపారు.
అనంతరం మళ్లీ ఎమ్మెల్సీగా చేసి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ అవకాశం కల్పించారు. ఈ క్రమంలో సోమవారం అనూహ్యంగా ఆయన సీఎం రేవంత్‍రెడ్డిని కలవడం గులాబీ శ్రేణుల్లో అలజడి రేపింది. ఓ విధంగా హస్తం పార్టీలో చేరేందుకు బండా ప్రకాశ్ నిర్ణయం తీసుకున్నారని తెలియడంతో బీఆర్‍ఎస్ పెద్దలు షాక్‍కు గురయ్యారు.
బండా ప్రకాశ్ బాటలోనే.. బస్వరాజు సారయ్య?
రాష్ట్రవ్యాప్తంగా 10 మంది ఎమ్మెల్సీలు గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ప్రచారం జరుగుతుండగా, అందులో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ముగ్గురు నేతల పేర్లు బలంగా వినపడ్డాయి. ఓరుగల్లులో గులాబీ పార్టీకి గతంలో ఎనిమిది మంది ఎమ్మెల్సీలుండగా కడియం, పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇద్దరూ ఎమ్మెల్యేలుగా గెలవడంతో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మండలి వైస్ చైర్మన్ ప్రకాశ్, బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్‍రెడ్డి, సిరికొండ మధుసూదనాచారి ఇలా ఆరుగురు మిగిలారు.
తాజాగా బండా ప్రకాశ్ రేవంత్‌ను కలవగా, మరో సీనియర్ బస్వరాజు సారయ్య సైతం కారు దిగి, కాంగ్రెస్‍లో చేరేందుకు ముహూర్తం పెట్టుకున్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. శనివారం సీఎం రేవంత్‍రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా బండా ప్రకాశ్, సారయ్య హనుమకొండ కలెక్టరేట్ కు వచ్చారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‍రెడ్డితో భేటీ అయ్యారు. ఇది జరిగిన 48 గంటల్లోనే బండా ప్రకాశ్ పార్టీ మార్పుపై ఓ నిర్ణయానికి రాగా, సారయ్య కూడా త్వరలో సీఎంను కలుస్తారని తెలిసింది.
వీరే కాకుండా గతంలో ఉమ్మడి జిల్లా బీఆర్‍ఎస్ బాధ్యతలు చూసిన మరో ఎమ్మెల్సీ పేరు సైతం వినపడుతోంది. ఇప్పటికే కడియం శ్రీహరి, కడియం కావ్య, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్, గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావులాంటి సీనియర్ నేతలంతా వరుసబెట్టి కారు దిగారు. తాజాగా ముగ్గురు ఎమ్మెల్సీల పేర్లు వినపడ్తుండడంతో బీఆర్ఎస్క్యాడర్ అయోమయంలో పడింది.