
- వరంగల్లో రాష్ట్ర స్థాయి రైతు ఉత్పత్తిదారుల సంఘాల మేళా షురూ
ఖిలా వరంగల్(మామునూరు) వెలుగు: రైతులు మోడ్రన్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సూచించారు. వరంగల్ సిటీలోని రంగశాయిపేటలో 3 రోజులు నిర్వహించే రాష్ట్ర స్థాయి రైతు ఉత్పత్తిదారుల సంఘాల మేళాను మంగళవారం ఎమ్మెల్సీ ప్రారంభించి మాట్లాడారు. ముఖ్యమంత్రి రైతు పక్షపాతి అని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు. ఇందిరమ్మ పాలనలో రైతులు, మహిళలు, కార్మికులకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల ద్వారా ఆర్థికంగా బ్యాంకు లింకేజీలు, రైతులు తక్కువ పెట్టుబడితో కొత్త టెక్నాలజీని వినియోగించి అధిక రాబడి పొందేలా శాస్త్రవేత్తలు మేళాలో పాల్గొని అవగాహన కల్పిస్తారని తెలిపారు. తెలంగాణలో ఎఫ్ పీఓల వృద్ధి, అభివృద్ధిని ప్రోత్సహించడమే లక్ష్యమన్నారు.
రాష్ట్రంలోనే తొలిసారిగా వరంగల్ జిల్లాలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల మేళాను నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40 ఉత్పత్తిదారుల సంఘాల తమ ఉత్పత్తుల స్టాల్స్, అమ్మకం నిర్వహిస్తాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామి రెడ్డి, ఎస్ ఎఫ్ ఏసీ డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ రామన్ సింగ్, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, పీజేటీఏయూ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి, అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ సుజాత, వ్యవసాయ అధికారి అనురాధ, డీఆర్ డీఓ కౌసల్యాదేవి, 33 జిల్లాల రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, రైతులు పాల్గొన్నారు.