- ఓరుగల్లులో 72 % పోలింగ్
- జనగామ జిల్లాలో అత్యధికంగా 76.28 శాతం
- జయశంకర్ భూపాలపల్లిలో అత్యల్పంగా 69.16
వరంగల్/ జనగామ/ మహబూబాబాద్/ జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 72.093 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల పరిధిలో జనగామ జిల్లాలో అత్యధికంగా 76.28 శాతం, అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లిలో 69.16 ఓటింగ్ నమోదైంది. హనుమకొండ జిల్లాలో 31,582 మంది అత్యధికంగా పోలింగ్‍లో పాల్గొనగా, అత్యల్పంగా ములుగు జిల్లాలో 7,677 మంది ఓటెయ్యడానికి వచ్చారు.
ఓటు వేసిన ప్రముఖులు...
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‍రెడ్డి హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్అండ్ సైన్స్ కాలేజీలో, బీఆర్‍ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‍రెడ్డి వడ్డెపల్లిలోని పింగళి మహిళా కాలేజీలో కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముగ్గురు అభ్యర్థులు ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటింగ్ సరళిని పరిశీలించారు.
మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, మురళీ నాయక్, కేఆర్.నాగరాజు, జనగామలో మాజీ ఎమ్మెల్యే, డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేశ్, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, రెడ్యా నాయక్, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తా పట్నాయక్ తదితరులు ఓటు వేసినవారిలో ఉన్నారు. మరిపెడలో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రనాయక్, తొర్రూరులో పాలకుర్తి ఎమ్మెల్యేయశస్విని రెడ్డి, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు ఓటు వేశారు.
డబ్బులు పంచిన గులాబీ లీడర్లు..
హనుమకొండ ఆర్ట్స్అండ్ సైన్స్ కాలేజీ వద్ద ప్రలోభాల పర్వం నడిచింది. ఓ వైపు ఎలక్షన్ నడుస్తుండగానే కొందరు బీఆర్‍ఎస్ నేతలు డబ్బులు పంపిణీ చేశారు. గమనించిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సుబేదారి సీఐ సత్యనారాయణరెడ్డి బీఆర్‍ఎస్ కార్యకర్త నుంచి రూ.10 వేలు స్వాధీనం చేసుకున్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మరిపెడ మండలం కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను బీఆర్‍ఎస్ నేతలు ప్రచారంలో మానసిక క్షోభకు గురి చేశారన్నారు.
మహబూబాబాద్ పోలింగ్ కేంద్రం సమీపంలో కాంగ్రెస్ నాయకులు, టౌన్ ఎస్సై ఉపేందర్‍కు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు బీఆర్‍ఎస్ కు సపోర్ట్ చేస్తున్నారని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అంజయ్య ఆరోపించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఏవీవీ కళాశాల వద్ద బీఆర్‍ఎస్, బీజేపీ తరఫున వేసిన టెంట్లను పోలీసులు తొలగిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ టెంట్లను ముట్టుకోకుండా వారికి సపోర్ట్ చేస్తున్నారని కార్యకర్తలు నిరసన తెలిపారు.
బీఆర్‍ఎస్, బీజేపీకి చెందిన నేతలు నన్నపునేని నరేందర్, ఎర్రబెల్లి ప్రదీప్‍రావు అక్కడకు చేరుకుని పోలీసులతో మాట్లాడారు. కాజీపేట ప్రశాంత్‍నగర్‍లోని తేజస్వీ స్కూల్ సెంటర్లోకి కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న వెంట 10 మందిని లోపలకు ఎలా పంపిస్తారంటూ బీజేపీ మహిళా మోర్చాకు చెందిన నేతలు పోలీసులతో వాదనకు దిగారు.
గెలుపు ఖాయం : తీన్మార్ మల్లన్న
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఉమ్మడి జిల్లాలోని పలు కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసే తనకు గ్రాడ్యుయేట్ల నుంచి మద్దతు ఉందన్నారు.
జిల్లాల వారీగా పోలింగ్వివరాలు
జిల్లా పోలింగ్ స్టేషన్లు ఓటర్ల సంఖ్య పోలైన ఓట్లు శాతం
వరంగల్ 59 43,812 31,036 70.84
హనుమకొండ 67 43,729 31,582 72.22
జనగామ 27 23,419 17,863 76.28
భూపాలపల్లి 16 12,535 8,669 69.16
ములుగు 17 10,299 7,677 74.54
మహబూబాబాద్ 36 34,933 24,285 69.52