- సోషల్ మీడియాలో హోరెత్తుతున్న ఎమ్మెల్సీ ప్రచారం
- ప్రతి రోజూ పదుల సంఖ్యలో కాల్స్, మెసేజ్‌లు
- క్యాండిడేట్లు మొదలు మంత్రులు, పార్టీ అధ్యక్షులు, సెలబ్రిటీల వాయిస్ రికార్డింగ్‌తో కాల్స్
- వాట్సాప్ గ్రూపుల్లో షేరింగ్‌లు, పాత వీడియోలతో ట్రోలింగ్‌లు
- తాము చేసే పనుల కంటే ఎదుటి వాళ్లపై బురద చల్లేందుకే మొగ్గు
వరంగల్, వెలుగు : ప్రస్తుతం గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చిందంటే చాలు లిఫ్ట్ చేసి మాట్లాడడానికే గ్రాడ్యుయేట్లు భయపడుతున్నారు. ఎవరైనా తెలిసిన వాళ్లేమోనని, పని ఉండి ఫోన్ చేశారేమోనని లిఫ్ట్ చేయగానే ‘హలో.. నేను మీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్‌ను, ఎన్నికల్లో నాకు ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసి గెలిపించండి’ అంటూ వాయిస్ వినిపిస్తుంది. ఇలా ప్రతి రోజు 10 నుంచి 15 కాల్స్ వస్తుండడం గ్రాడ్యుయేట్ ఓటర్లకు తలనొప్పిగా మారింది.
క్యాండిడేట్లతో పాటు లీడర్ల వాయిస్ సైతం...
క్యాండిడేట్లు తాము చెప్పాలనుకున్న విషయాన్ని ముందుగానే రికార్డు చేయించారు. ఒక్కో క్యాండిడేట్ రికార్డింగ్ కాల్ 40 సెకన్ల నుంచి నిమిషం వరకు ఉంటోంది. కొందరు క్యాండిడేట్లు తమకు మద్దతుగా పార్టీ అధ్యక్షులు, మంత్రులు, సెలబ్రిటీలతో 3 నిమిషాల వ్యవధి గల రికార్డెడ్ ఫోన్ కాల్స్ తయారు చేయించారు. వాటిని ఏజెన్సీలకు అప్పగించి గ్రాడ్యుయేట్లకు వరుస ఫోన్లు చేయిస్తున్నారు. మొదట్లో ఈ తరహా ఫోన్ కాల్స్ వస్తే క్యాండిడేట్ ఏం చెబుతున్నారో వినాలనుకున్న ఓటర్లు, ఇప్పుడు రోజుకు పదుల సంఖ్యలో వస్తుండడంతో డిస్ట్రబ్ అవుతున్నారు.
52 మంది క్యాండిడేట్లు 4.61 లక్షల మంది ఓటర్లు
వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి 2021లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ క్యాండిడేట్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలిచారు. ఆయన పదవీకాలం 2027 వరకు ఉన్నప్పటికీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఉప ఎన్నిక తప్పనిసరి అయింది. కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీఆర్‌ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్‌రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‍రెడ్డితో కలిపి మొత్తం 52 మంది పోటీ పడుతున్నారు. ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గం 12 జిల్లాల పరిధిలో ఉండగా మొత్తం 4,61,806 మంది ఓటర్లు ఉన్నారు.
ఈ నెల 27న ఎన్నిక జరగనుంది. క్యాండిడేట్లు ప్రచారం కోసం అన్ని జిల్లాలు తిరగలేక ఫోన్‌కాల్ ప్రచారానికి దిగారు. గ్రాడ్యుయేట్ ఓటర్ లిస్ట్ ఆధారంగా ఫోన్ నంబర్లను సేకరించి ప్రతి ఒక్క ఓటరుకు వరుస ఫోన్ కాల్స్ చేయిస్తున్నారు. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల టైంలో ముగ్గురో, నలుగురో క్యాండిడేట్లు పోటీలో ఉన్నందున ఈ తరహా ఫోన్ కాల్స్ పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. కానీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు ఉండటం, అందులో చాలామంది ఈ తరహా ప్రచారానికే జై కొట్టడం ఓటర్లకు తలనొప్పిగా మారింది.
వాట్సాప్ గ్రూపుల్లోనూ మెసేజ్‌ల మోత
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల క్యాండిడేట్లు తాము ఏం చేస్తామో చెప్పకుండా, ప్రత్యర్థులను తిట్టడానికి సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా ఆయా పార్టీల సోషల్ మీడియా టీంలు గ్రాడ్యుయేట్లు, టీచర్లు, ఇతర ఉద్యోగులు ఉండే వాట్సాప్ గ్రూప్‌లను సెలెక్ట్ చేసుకుంటున్నాయి. ఇందులోనూ గ్రాడ్యుయేట్లను ఓటు అడగడం కంటే ఎదుటి పార్టీ క్యాండిడేట్‌ను బ్లేమ్ చేయడానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రస్తుతం పోటీలో ఉన్న క్యాండిడేట్లు గతంలో వివిధ పార్టీల్లో పనిచేసిన టైంలో మాట్లాడిన మాటలు, వేసిన పంచ్‌లను వెతికి మరీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు.
ప్రస్తుత ప్రచారంలోని మాటలను, పాత వీడియోలతో కలిపి ట్రోల్ చేస్తున్నారు. పోటీలో ఉన్న క్యాండిడేట్లు, వారిని సపోర్ట్ చేసే లీడర్లు ప్రచారంలో నాలుగు మాటలు మాట్లాడటమే ఆలస్యం.. దానిని ఎడిట్ చేసి వీలైతే ఓ పాట లేదంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి క్షణాల్లో వందలాది గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియాపై ఈసీ పెద్దగా ఫోకస్ పెట్టకపోవడంతో ఈ నెల 27 వరకు గ్రాడ్యుయేట్లకు ఫోన్ ఎత్తాలన్నా, వాట్సాప్ ఓపెన్ చేయాలన్నా ఇబ్బంది తప్పేలా లేదు.