కేజీబీవీ టీచర్లకు మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేయాలి : ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య

కేజీబీవీ టీచర్లకు మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేయాలి : ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య
  • బీజేపీ ‘కరీంనగర్’ టీచర్  ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య

హైదరాబాద్/ ఆర్మూర్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) పనిచేస్తున్న టీచర్లందరికీ మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేయాలని కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు టీచర్లు, ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు.

ఆదివారం వివిధ జిల్లాలకు చెందిన కేజీబీవీ టీచర్లను ఆయన కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొమరయ్య మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కేజీబీవీల్లో పనిచేసే టీచర్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మోడల్ స్కూళ్లలో మాదిరిగా కేజీబీవీల్లోనూ కేర్ టేకర్ లేదా వార్డెన్లను నియమించాలని కోరారు. మహిళా ఉద్యోగులందరికీ చైల్డ్ కేర్ లీవులను  వర్తింపజేయాలన్నారు. టీచర్లు, ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు జారీచేసి, నగదు రహిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో పనిచేసే టీచర్లకూ ఎంటీఎస్ అమలు చేయాలన్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే.. కేజీబీవీ టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. 

మద్దతిస్తున్న అందరికి కృతజ్ఞతలు

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం నుంచి వచ్చిన వివిధ సంఘాల టీచర్లతో కూడా మల్క కొమరయ్య సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంఘాలకు అతీతంగా తనకు మద్దతునిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. టీచర్ల సమస్యలన్నీ తనకు తెలుసని.. చాలావరకు సమస్యలకు సరైన బడ్జెట్ లేకపోవడమే కారణమన్నారు. బడ్జెట్ కేటాయింపులు చాలినంత చేయకుండా విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. 317 జీవో మీద అప్పటి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చేసిన ఉద్యమాన్ని గుర్తు చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి తాను ప్రభుత్వంతో పోరాడుతానని తెలిపారు.